6 రోజులు.. 5 రకాల టిఫిన్లు...ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ మెనూ

6 రోజులు.. 5 రకాల టిఫిన్లు...ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌ మెనూ
  •     రెండ్రోజులు మిల్లెట్‌ ఇడ్లీ.. ఓ రోజు మిల్లెట్ ఉప్మా
  •     మరో మూడు రోజులు పూరీ, దోశ, బోండా 
  •     ఇంకో మూడ్రోజులు పాలు.. మూడు రోజులు రాగి జావ 
  •     19 లక్షల మంది స్టూడెంట్లకు అందనున్న పౌష్టికాహారం

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడి పిల్లల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మెనూ రెడీ చేశారు. వారంలో ఆరు రోజులు ఐదు రకాల టిఫిన్లు అందించనున్నారు. రెండు రోజులు మిల్లెట్ ఇడ్లీ.. ఓ రోజు మిల్లెట్ ఉప్మా.. మూడు రోజులు పాలు.. మరో మూడు రోజులు రాగి జావ అందించాలని నిర్ణయించారు. జూన్​2న స్కూల్ రీఓపెనింగ్ రోజు నుంచే విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ స్కీమ్ కోసం రూ.720 కోట్లు..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ 26,178 సర్కారు బడుల్లో సుమారు19 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం ఎలాంటి అల్పాహారం తినడం లేదని, దీని వల్ల చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని పలు రిపోర్టులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించాలని నిర్ణయించింది. 

జూన్ 12 నుంచి దీనిని అమలు చేయనుండగా, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గురువారం మెనూ రిలీజ్ చేశారు. తాజా బడ్జెట్‌లోనూ ఈ స్కీమ్‌ కోసం ప్రభుత్వం రూ.720 కోట్లు కేటాయించింది. ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సర్కార్‌‌ భావిస్తోంది. మెనూలో భాగంగా మంగళ, గురువారాల్లో మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా, సోమవారం దోశ, బుధవారం పూరీ, శనివారం బోండా అందిస్తారు. 

మూడు రోజులు పాలు.. 

విద్యార్థులకు టిఫిన్లే కాకుండా, చిన్నారుల ఎదుగుదల కోసం పాలు, రాగి జావను కూడా మెనూలో చేర్చారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు అందించనుండగా, మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ పంపిణీ చేయనున్నారు. ఈ స్కీమ్‌ అమలు కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనుంది. 

టిఫిన్ కోసం సుమారు రూ.540 కోట్లు, పాల సరఫరా కోసం మరో రూ.180 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను స్కూల్ ఎడ్యుకేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద కేటాయించనున్నారు. అయితే, ఈ పౌష్టికాహార స్కీమ్‌తో బడిలో పిల్లల అటెండెన్స్ పెరగడంతో పాటు డ్రాపౌట్లు భారీగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 

మెనూ ఇలా..

సోమవారం    దోశ, పాలు 
మంగళవారం    మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ
బుధవారం    పూరీ, పాలు
గురువారం    మిల్లెట్ ఇడ్లీ, రాగిజావ
శుక్రవారం     మిల్లెట్ ఉప్మా/ పొంగల్​, పాలు
శనివారం     బోండా, రాగి జావ