ఫీజుల కోసం సతాయిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు

ఫీజుల కోసం సతాయిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు

​​​​

  • ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని సర్కారు ఆదేశాలు
  • తాము ఎంత చెప్తే అంత కట్టాలంటున్న మేనేజ్మెంట్లు 
  • కట్టకుంటే ఎగ్జామ్స్ పెడ్తలేరు.. ఆన్​లైన్​ క్లాసులకు 
  • పర్మిషన్​ ఇస్తలేరు టీసీల్లో  పేరెంట్స్​ క్యారెక్టర్​ను 
  • కించపరిచేలా తప్పుడు రాతలు
  • ఎన్ని కంప్లైంట్లు​ చేసినా స్పందించని ఆఫీసర్లు

హైదరాబాద్​/ మంచిర్యాల, వెలుగు: ఫీజుల కోసం కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూళ్లు  పేరెంట్స్​ను సతాయిస్తున్నాయి. ఆన్​లైన్​ క్లాసులు నడుస్తున్నందున వాటి మందమే ట్యూషన్​  ఫీజులు తీసుకోవాలని, అది కూడా నెలవారీగా తీసుకోవాలని ప్రభుత్వం జీవో ఇస్తే.. అది ఎక్కడా అమలైతలేదు. లైబ్రరీ ఫీజులు, క్యాంటీన్​ ఫీజులు, మెయింటెనెన్స్​ ఫీజులు,  ల్యాబ్​ ఫీజులు, స్పోర్ట్స్  ఫీజులు, ట్రావెలింగ్​ ఫీజులు.. ఇట్ల ఇష్టమున్నట్లు స్కూల్​ మేనేజ్మెంట్లు దోచుకుంటున్నాయి. ఆఫ్​లైన్​లో క్లాసులు లేనప్పుడు ఇట్లెట్ల వసూలు చేస్తరని పేరెంట్స్​  ప్రశ్నిస్తే..  బెదిరింపులకు దిగుతున్నాయి. చెప్పినంత ఫీజు కట్టకుంటే పిల్లలకు ఎగ్జామ్స్​ పెట్టకుండా, ఆన్​లైన్​ క్లాస్​ల  లింక్​ ఇయ్యకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.  కొన్ని కార్పొరేట్​ బడులైతే టీసీల్లోని రిమార్క్​ కాలమ్​లో తల్లిదండ్రుల క్యారెక్టర్​పై తప్పుడు రాతలు రాస్తున్నాయి. ‘లిటిగెంట్​ పేరెంట్’​ అని, ‘ఫీజు నాట్​ పెయిడ్​– - ఇష్యూస్’ ఇని రిమార్క్​లు వేస్తున్నాయి. ఎనిమిదో తరగతి వరకు అడ్మిషన్లకు టీసీ అవసరం లేదని ప్రభుత్వం చెప్తున్నా.. అది కూడా ఎక్కడా అమలైతలేదు. టీసీ ఉంటేనే చేర్చుకుంటామని స్కూల్​ మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. రూరల్​, అర్బన్​ ఏరియాల్లోని కొన్ని బడ్జెట్​స్కూళ్లు తప్ప.. కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూళ్లు  ఫీజుల దోపిడీకి తెగబడుతున్నాయి.  
ఫిర్యాదులు చేసినా ఫాయిదా ఉంటలేదు
రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్​తో ప్రభుత్వం నిరుడు మార్చి నెలాఖరు నుంచి విద్యాసంస్థలను బంద్​ చేసింది. స్టూడెంట్లకు ఆన్​లైన్​ క్లాస్​లు నిర్వహించాలని సూచించింది. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు గతేడాది ఏప్రిల్​లో జీవో 46ను జారీ చేసింది. 2020–21 అకడమిక్​ ఇయర్​లో ట్యూషన్​ ఫీజులు నెలవారీగా మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. అంతకుముందు విద్యాసంవత్సరం ఉన్న ఫీజులనే తీసుకోవాలని, ఫీజులు పెంచరాదని స్పష్టం చేసింది. 

ఈ జీవోను ఉల్లంఘించిన స్కూళ్లపై యాక్షన్​ తీసుకోవాలని ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​కు ఆదేశాలు ఇచ్చింది. పేరెంట్స్​ నుంచి కంప్లైంట్​ తీసుకొని పరిష్కరించేందుకు డీఈవో ఆఫీసుల్లో హెల్ప్​డెస్క్​లను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. పలు స్కూళ్లపై పేరెంట్స్​ నుంచి  కంప్లైంట్స్​ వచ్చినా విద్యాశాఖ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జీవో 46 ప్రకారం ట్యూషన్​ ఫీజులే తీసుకోవాల్సి ఉండగా.. ఇష్టమున్నట్లు ఫీజులు గుంజుతున్నాయి. 

ట్యూషన్​ ఫీజు నిర్ణయించేదెవరు..?

ప్రైవేట్​ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై గత కాంగ్రెస్​ ప్రభుత్వం 41, 42, 91 జీవోలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం రూరల్​, అర్బన్​, గ్రేటర్​ పరిధిలో ఫీజులను నిర్ణయించింది. కానీ ఈ జీవోలు అమలు చేయడంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఫెయిలైంది. జీవో  నంబర్​1 ప్రకారం ప్రైవేట్​ స్కూళ్లలో కల్పించిన సౌకర్యాలను బట్టి పేరెంట్స్​ కమిటీ ఆధ్వర్యంలో ఫీజు స్ట్రక్చర్​ను నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ అది జరగడం లేదు. మేనేజ్​మెంట్లు ఏకపక్షంగా ఫీజులు నిర్ణయించి పేరెంట్స్​పై భారం మోపుతున్నాయి. క్లాస్​ల నిర్వహణకు అయ్యే ఖర్చులను లెక్కించి ట్యూషన్​ ఫీజును నిర్ణయించాల్సి ఉండగా, ఇన్​ఫ్రాస్ర్టక్చర్​, మెయింటెనెన్స్​, లైబ్రరీ, ల్యాబ్​, స్పోర్ట్స్​, హాబీస్​, టూర్స్​ అని రకరాల ఫీజులు కలిపి కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. జీవో 46 ప్రకారం ట్యూషన్​ ఫీజు మాత్రమే కట్టాలి. కానీ కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూళ్లు ట్యూషన్​ ఫీజు పరిధిలోకి రాని వాటిని కూడా  ట్యూషన్​ ఫీజుగానే జమకట్టి వసూలు చేస్తున్నాయి. స్టూడెంట్లకు ఇచ్చే రశీదుల్లో ఆయా ఫీజులను పేర్కొనకుండా గంపగుత్తగా రాసిస్తున్నాయి. ఉదాహరణకు మంచిర్యాలలోని ఒక కార్పొరేట్​ స్కూల్​లో టెన్త్​క్లాస్​కు రూ. 30 వేల ఫీజు ఉంటే... నెలకు రూ. 3వేల చొప్పున, మరో స్కూల్​లో రూ. 40 వేల ఫీజు ఉంటే... నెలకు రూ. 4 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్​ స్కూళ్లయితే  ఆన్​లైన్​ క్లాస్​లకు యూనిఫామ్స్​తో అటెండ్​ కావాలని రూల్స్​ పెడుతున్నాయి.  

ఆన్​లైన్​ క్లాసులు కట్​ చేస్తున్నరు

‘ట్యూషన్ ఫీజు కంటే ఎక్కువ ఎందుకు కట్టాలని ప్రశ్నించినందుకు మా అబ్బాయిని ఆన్​లైన్ క్లాస్ నుంచి తీసేశారు. మా అబ్బాయి హైదరాబాద్​ హిమాయత్ నగర్ లోని సెయింట్ ఆంథోని హై స్కూల్ లో మూడో క్లాస్ చదువుతున్నాడు. ఫీజులపై ప్రభుత్వం ఇష్యూ చేసిన జీవోలను ప్రైవేట్ స్కూళ్లు వారికి అనుగుణంగా మార్చుకుంటున్నాయి అసలు జీవో 46ని లెక్కే చేయట్లేదు. అసలు జీవోలు ఎందుకు ఇస్తున్నట్లు? జీవోలు జారీచేసి తన్నుకు చావండి అన్నట్లు ఉంది ప్రభుత్వ తీరు. నేను హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ చేశాను. నా కూతురు సికింద్రాబాద్ లోని స్కూళ్లో పదో తరగతి చదువుతుంది. ఆ స్కూల్ నుంచి ఇదే సమస్య”అని   రవీందర్  అనే పేరెంట్​ ఆవేదన వ్యక్తం చేశాడు. అధిక ఫీజుల గురించి ప్రశ్నిస్తే.. ఆన్​లైన్​ క్లాసులను స్కూల్​ మేనేజ్మెంట్లు కట్​ చేస్తున్నాయి. చెప్పినంత కడితేనే అనుమతిస్తామని తేల్చిచెప్తున్నాయి. కొన్ని స్కూళ్లు  గతేడాది ఫీజు కంటే 25 నుంచి 40శాతం పెంచేశాయి. ‘‘మా బాబు బేగంపేట్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో నాలుగో తరగతి. గతేడాది రూ. 65 వేలు ఫీజు ఉండేది. ఇప్పుడు అది రూ. లక్ష అయింది. స్టేషనరీ వంటివాటికి మరో ఐదు వేలు. మొత్తంగా ఈ ఏడాది లక్షా ఐదువేలు దాటుతుంది. తగ్గించుమంటే టీసీ తీసుకుని పొమ్మన్నరు. ఇప్పుడు వేరే స్కూల్ లో జాయిన్ చేసినం” అని వినీత అనే పేరెంట్​ తెలిపారు. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 7 వేల ప్రైవేట్ స్కూళ్లున్నాయి. వాటిలో 15 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో 60 శాతం ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వెయ్యి నుంచి 1500 వరకు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ట్యూషన్ ఫీజులు మాత్రమే అది కూడా గతేడాది ఎంత ఉండెనో అంతే చార్జ్​ చేయాలని గవర్నమెంట్ జీవో ఇస్తే.. వాటిని మేనేజ్మెంట్లు పట్టించుకోవడం లేదు. 

టీసీల్లో తప్పుడు రాతలు

సర్కారు నిర్ణయించిన జీవో ప్రకారమే ఫీజులు కడతామని పేరెంట్స్​ చెప్తే.. కొన్ని కార్పొరేట్​ స్కూళ్లు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. పిల్లలకు ట్రాన్స్​ఫర్​ సర్టిఫికెట్లు (టీసీలు) ఇచ్చేస్తున్నాయి. టీసీల్లో ఉండే రిమార్క్ కాలమ్ లో పేరెంట్స్ గురించి ఇష్టమొచ్చిన రాతలు రాస్తున్నాయి. తమ స్కూల్​కు ఆ పేరెంట్స్​ నష్టం చేశారని ఆరోపిస్తూ రిమార్క్ కాలమ్ లో ‘లిటిగెంట్ పేరెంట్’ అని రాస్తున్నాయి. దీనివల్ల ఆ స్టూడెంట్​కు ఇంకెక్కడా అడ్మిషన్ దొరకకూడదని ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్​ అమీర్ పేట్ లోని నీరజ్ పబ్లిక్ స్కూల్  ఇచ్చిన టీసీల్లో ‘లిటిగెంట్​ పేరెంట్​’ అని రాయడం వివాదాస్పదమైంది. ఈ స్కూల్​లో ఎక్కువ ఫీజులు గుంజుతున్నారంటూ పోయినేడు పిల్లల పేరెంట్స్ ఆందోళన చేశారు. అయినా మేనేజ్మెంట్​ తీరు మారలేదు. ఈ క్రమంలో తమ పిల్లలను ఆ స్కూల్ నుంచి తీసేయాలని గతేడాది డిసెంబర్ లో టీసీల కోసం తల్లిదండ్రులు అప్లయ్​ చేశారు. ఆరునెలలు తిప్పించుకుని జూన్ 18న మేనేజ్మెంట్​ టీసీలు ఇచ్చింది. అయితే, అందులో రిమార్క్స్ కాలమ్ లో ‘లిటిగెంట్ పేరెంట్’ అని రాశారు. 150మందికి పైగా పేరెంట్స్ కు ఇదే సమస్య ఎదురైంది. వీళ్లంతా విద్యాశాఖ అధికారులకు  కంప్లైంట్  చేసినా ఎలాంటి న్యాయం దొరకలేదు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని ఓ కార్పొరేట్ స్కూల్ కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే.. టీసీ తీసుకుని వెళ్లిపోవచ్చని బెదిరిస్తోంది. టీసీలో  రీమార్క్స్ లో ‘ఫీజు నాట్ పెయిడ్, ఇష్యూస్’ అనే కంప్లైంట్స్ రాస్తున్నాయి. బేగంపేట్ లోని మరో స్కూల్​లోనూ ఇలాంటి తతంగమే నడుస్తోంది. అధిక ఫీజుల సమస్య పెరగడంతో ఎనిమిదో తరగతి వరకు స్టూడెంట్స్ కు స్కూళ్లు మారడానికి ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ అవసరం లేదని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. అయితే స్కూల్ మారాలంటే టీసీ తప్పనిసరి అని స్కూల్​ మేనేజ్మెంట్లు చెప్తున్నాయి.  

ఆన్​లైన్  క్లాసులు కట్ చేస్తున్నరు

మా బాబు ఖమ్మంలోని ఓ కార్పొరేట్ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నడు. స్కూల్​కు పోకున్నా ఫుల్​ ఫీజు కట్టాలని అడుగుతున్నరు. కొద్ది రోజుల నుంచి ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నరు. వెంటనే ఫీజు కట్టకపోతే ఆన్​లైన్​ క్లాసులు కూడా వినొద్దంటూ, ఆన్​లైన్ క్లాసుల లింక్ కట్ చేస్తున్నరు. ఫీజు కడితేనే క్లాసులు చెబుతామని అంటున్నరు.
‑ కూరపాటి లక్ష్మి, ఖమ్మం

టీసీలో ‘లిటిగెంట్​ పేరెంట్​’ అని రాసిండ్రు

మా అబ్బాయి ఐదేండ్లు అమీర్​పేటలోని నీరజ్​ పబ్లిక్​ స్కూల్​లో చదివిండు. ఏడాదికి లక్షకు పైగానే ఫీజు కట్టినం. ఆన్​లైన్ క్లాసులు చెప్పి లంచ్ బిల్లు వేసిన్రు. ఇదేం పద్ధతి అని అడిగితే.. ఇష్టమొచ్చినట్లు మాపై కామెంట్లు చేసిన్రు. అందుకే టీసీకి అప్లయ్​ చేసినం. మొత్తం ఫీజు కట్టినంకనే టీసీ అడిగినం. టీసీలో నన్ను ‘‘లిటిగెంట్ పేరెంట్’’ అని రాసిన్రు. నేనేమన్న వాళ్ల స్కూల్ బిల్డింగ్ కూలగొట్టిన్నా? లేక వాళ్లకేమైనా నష్టం చేసిన్నా? నన్నెట్ల అట్లంటరు. దీనిమీద ఎవరికి కంప్లైంట్​ చేసినా లాభం ఉంటలేదు. మాకు న్యాయంచేయాలె. 
‑ సికిందర్, అమీర్​పేట్, హైదరాబాద్​

టీసీ కోసం తిప్పుకుంటున్నరు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చెర్వుకొమ్మ తండాకు చెందిన రమణ కుమారుడు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్​లో  టెన్త్​  కంప్లీట్ చేసిండు. ఏడాది ప్రారంభానికి ముందే అబ్బాయికి స్కూల్ ఫీజు రూ. 30 వేలు మాట్లాడుకున్నారు. గతేడాది నెల రోజులు మాత్రమే స్కూల్​లో  క్లాసులు చెప్పారు. తర్వాత అన్నీ ఆన్ లైన్ చదువులే. ప్రభుత్వం టెన్త్​ స్టూడెంట్లను ప్రమోట్ చేయడంతో, ఇప్పుడు టీసీ కోసం స్కూల్ కు వెళ్లగా  మాట్లాడుకున్న దానికి అదనంగా రూ. 5 వేలు కట్టకపోతే టీసీ ఇవ్వబోమని స్కూల్​ మేనేజ్మెంట్​ బెదిరించింది. దీంతో రమణ అప్పు చేసి మరీ రూ. 35 వేలు కట్టారు. అయినా టీసీ ఇవ్వకుండా మళ్లీ రమ్మని తిప్పుకుంటున్నారని ఆయన వాపోతున్నారు.

జీవోలు పాస్​ చేస్తే సరిపోతదా?

గవర్నమెంట్ జీవోలు పాస్ చేస్తుంది కానీ అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయని మాత్రం పట్టించుకోవడంలేదు. అధిక ఫీజులు వసూలు చేసే స్కూళ్లకు నోటీసులు ఇచ్చి సైలెంట్ అయిపోయింది. స్కూల్​ మేనేజ్మెంట్లు మాత్రం పేరెంట్స్ ను వేధిస్తూనే ఉన్నాయి. టీసీల్లో.. ఫీజు నాట్ పెయిడ్, లిటిగెంట్​ పేరెంట్ అని కామెంట్లు చేస్తున్నాయి. ఈ టీసీలను తీసుకొని వేరే స్కూల్ లో పిల్లలను జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులకు మర్యాద, గౌరవం ఉంటాయా? సమస్యను సర్కారు పరిష్కరించాలి. 
- వెంకట్ సాయినాథ్ ,  హైదరాబాద్​ స్కూల్స్​ పేరెంట్స్​ అసోసియేన్​ జాయింట్ సెక్రెటరీ

ఫీజు కట్టలేదని ఎగ్జామ్స్​ రాయనియ్యలే

మంచిర్యాలలోని ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు స్థానికంగా ఉన్న ప్రైవేట్​ స్కూల్​లో ఐదు, ఏడు తరగతులు చదువు తున్నారు. స్కూల్​ మేనేజ్మెంట్​ గతంలో ఉన్న ఇయర్లీ ఫీజును 10 నెలలకు డివైడ్​ చేసి నెలనెలా వసూలు చేస్తోంది. ప్రభుత్వం ఆన్​లైన్​ క్లాస్​లకు ట్యూషన్​ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆర్డర్స్​ ఇచ్చిందని ప్రశ్నిస్తే.. ‘అందరూ కడ్తున్నరు. మీరూ కట్టాల్సిందే’ అని  బదులిచ్చారు. ఫీజు చెల్లించకపోవడంతో ఆ ఇద్దరు పిల్లలకు సోమవారం ఆన్​లైన్​ ఎగ్జామ్స్​ రాయనియ్యలే.