
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హితీక్ష హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హితీక్షను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి హితీక్ష పిన్ని మమతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మమతనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్క మమత మాత్రమే ఈ చిన్నారిని హత్య చేసిందా (లేదా) పాప హత్యకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఆదర్శనగర్లో శనివారం రాత్రి దారుణ హత్యకు గురైన చిన్నారి హితీక్ష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పాప డెడ్ బాడీని ఇంటికి చేర్చారు. పాపను చివరిసారిగా చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. చిన్నారి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడికి వెళ్లిన స్థానికుల హృదయాలను కలచివేసింది.
చిన్నారి హితీక్షను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కోరుట్ల టౌన్ ఆదర్శనగర్‌కు చెందిన ఆకుల రాము, నవీన దంపతులకు కొడుకు వేదాన్ష్, కూతురు హితిక్ష(5), ఉన్నారు. శనివారం సాయంత్రం హితిక్ష తోటి పిల్లలతో కలిసి ఇంటిముందు దాగుడుమూతల ఆట ఆడుతూ.. దాచుకునే క్రమంలో పక్కింట్లోకి వెళ్లింది. ఆ తర్వాత చిన్నారి కనిపించలేదు.
పాప కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఓ ఇంట్లో పరిశీలించగా.. బాత్రూమ్లో రక్తపు మడుగులో హితిక్ష డెడ్ బాడీ కనిపించింది. చిన్నారి గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు.