హెల్త్‌ గురించి పట్టించుకుంటలేరు

హెల్త్‌ గురించి పట్టించుకుంటలేరు
  • ఉద్యోగులకు ఆరోగ్యంపై శ్రద్ధ అంతంతే.. 40 శాతం మందిది అదే పరిస్థితి

తినే తిండి మారుతోంది.. ఒకప్పుడు అన్నం కూరలే. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు తోడైనయ్​. ఒంట్లోకి వెళుతున్న కేలరీలు ఎక్కువైతున్నయ్​. టెక్నాలజీ అంది వచ్చింది. డిజిటల్​ యుగమైంది. తల దించితే ఎత్తేది గంటల తర్వాతే. ప్రెస్టీజ్​ ఎక్కువైంది. అవసరాలూ తోడైనయ్​. రోడ్లపై బండ్లు పెరిగినయ్​. ఆరోగ్యానికి పొగ పెడుతున్నయ్​. పోటీ ప్రపంచం ఎదురొచ్చింది.
ఉరుకుల పరుగుల ఉద్యోగాలైనయ్​. ఇంటి కాడ కూడా పనిచేయాల్సిన రోజులొచ్చినయ్​. ..ఇంతలా మన ప్రపంచం మారిపోయింది. మరి, మారిన ప్రపంచంతో పాటే మన ఆరోగ్యాన్ని ఎంత వరకు కాపాడుకుంటున్నాం? ఫిట్​గా ఉండేందుకు
సరైన ఎక్సర్​సైజులు చేస్తున్నామా? చాలా మంది ఈ విషయంలో సరైన శ్రద్ధ పెట్టట్లేరనే అంటోంది అసోచామ్​ సర్వే. అవును, 40 శాతం మందికిపైగా ఉద్యోగులు ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదని తేల్చింది.

ఉద్యోగుల్లో లైఫ్​స్టైల్‌‌‌‌ వ్యాధులు పెరిగిపోతున్నట్టు అసోచామ్​ సర్వే తేల్చింది. మామూలు జనాలతో పోలిస్తే ఆఫీసుల్లో పనిచేసే వాళ్లలో ఆ ముప్పు ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. కార్పొరేట్​కంపెనీల్లో పనిచేస్తున్న 37 శాతం మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టట్లేదని, 12 శాతం మందికి అసలు వాళ్ల ఆరోగ్యం గురించి కనీస అవగాహన కూడా లేదని సర్వే తేల్చింది. భవిష్యత్తులో ఆరోగ్యాన్ని బాగా చూసుకునేందుకు 48 శాతం మంది అవగాహనతో ఉన్నారు. 18 రంగాల్లో 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న 500 మంది కార్పొరేట్​ ఉద్యోగులను వారి జీవన విధానం, తిండి అలవాట్లు, ఎక్సర్​సైజులపై అసోచామ్​ ఇంటర్వ్యూ చేసింది.  వారంలో ఓ గంటపాటైనా వ్యాయామం చేయట్లేదు ఉద్యోగులు. 25 శాతం మంది వారంలో ఒక్క గంట కూడా ఎక్సర్​సైజులకు టైం కేటాయించట్లేదు. 24 శాతం మంది వారంలో 13 గంటలు, 9 శాతం మంది 3 నుంచి 6 గంటలు ఎక్సర్​సైజులు చేస్తున్నారు. కార్పొరేట్​ఉద్యోగులైతే కేవలం 5 శాతం మందే వారంలో 6 గంటల పాటు ఎక్సర్​సైజులకు టైంను కేటాయిస్తున్నారు. మిగతా వాళ్ల పరిస్థితి గురించి చెప్పుకునేదేముంటుంది? సరైన శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది ఉద్యోగులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తేలింది. కొందరిని పెద్ద సమస్యలే పట్టి పీడిస్తున్నాయి. చురుగ్గా లేకపోవడం వల్ల 11 శాతం మంది, అనారోగ్య సమస్యలతో 1 శాతం మంది సరిగ్గా పని కూడా చేయలేకపోతున్నారట. ఆరోగ్యం బాగున్నా 14 శాతం మంది అలసటగా ఉంటున్నట్టు తేలింది. 9 శాతం మందికి కంటి మీద కునుకు తక్కువట. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే మరింత చురుగ్గా పనిచేస్తారన్న ఉద్దేశంతో చాలా కార్పొరేట్​ కంపెనీలు వెల్​నెస్​ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి వెల్​నెస్​ ప్రోగ్రాంలు సూపర్​ అని అంటున్నారు 93 శాతం మంది ఐటీ ఉద్యోగులు. మిగతా 7 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. మీడియా రంగంలోని 60 శాతం మంది మంచి ప్రోగ్రామ్​ అని అంటుంటే, మిగతా 40 శాతం మంది అంత మంచిదేం కాదంటున్నారు. ఎఫ్​ఎంసీజీ రంగంలోని 84 శాతం మంది ఉద్యోగులు ఈ ప్రోగ్రాంలపై సంతృప్తితో ఉన్నారు. అన్ని రంగాల ఉద్యోగులను లెక్కలోకి తీసుకుంటే 84 శాతం మంది కంపెనీల్లో పెట్టే వెల్​నెస్​ ప్రోగ్రాంలు చాలా మంచివని అంటున్నారు.

వారంలో 150 నిమిషాలు

మన జీవన విధానానికి తగ్గట్టు ఎక్సర్​సైజులు చేయకపోవడం వల్ల బీపీ, గుండె జబ్బులు, షుగర్​ వంటి రోగాలు వచ్చే ముప్పు ఉంటుంది. అయినా చాలా మంది వ్యాయామానికి దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అందుకే 2025 నాటికి ఆ సమస్యను 10 శాతానికి తగ్గించాలన్న లక్ష్యం పెట్టుకుంది. వారంలో కనీసం 150 నిమిషాలైనా శ్రమ ఎక్కువగా లేని వేగంగా నడవడం, సమంగా ఉన్న నేలపై లేదా చిన్న గుట్టలపై సైకిల్​ తొక్కడం, టెన్నిస్​, వాలీబాల్​, బాస్కెట్​బాల్​ వంటివి ఆడడం, లాన్​ మూవర్ నెట్టడం వంటి పనులను చేయాలని చెప్పింది. 75 నిమిషాలపాటు కఠినమైన ఎక్సర్​సైజులైనా చేయాలని సూచించింది. బరువులు ఎత్తడం, సాగే బ్యాండ్స్​తో వ్యాయామం, పుషప్స్​, సిటప్స్​, గుంతలు తవ్వడం, తోటపనులు, యోగా వంటివి చేయాలని సూచించింది.