- మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : ప్రభుత్వ వైద్యశాలల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను సమీక్షించారు. డయాలిసిస్ రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆస్పత్రికి నేటి నుంచే 24 గంటల నిరంతర ప్రత్యేక విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. అదనపు బెడ్లు, ఏసీల ఏర్పాటుతో పాటు మరో అంబులెన్స్‌ను కూడా కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గతంలో రూ. 22 కోట్లతో మంజూరైన 100 పడకల నూతన ఆస్పత్రి భవన పనులు పూర్తయ్యాయని, త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న అంబేద్కర్ కళాభవన పనులను మంత్రి పరిశీలించారు. నిధుల కొరత లేకుండా చూస్తామని, ఈ కళాభవనం స్థానిక కళాకారుల ప్రతిభకు వేదికగా మారుతుందని చెప్పారు. ఆస్పత్రి వద్దకు వచ్చే రోగుల సౌకర్యార్థం రూ. 5 లక్షలతో బస్ షెల్టర్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఆస్పత్రి సేవలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
