సర్కారు దవాఖానల్లో కార్పొరేట్​వైద్యం: శ్రీధర్​బాబు

సర్కారు దవాఖానల్లో కార్పొరేట్​వైద్యం: శ్రీధర్​బాబు
  • రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్​ప్రొఫైల్ ​తయారు చేస్తం 
  • ప్రభుత్వ మెడికల్​ కాలేజీలు టెక్నాలజీ వాడుకోవాలి
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

గోదావరిఖని, వెలుగు : సర్కారు దవాఖానల్లో కార్పొరేట్​స్థాయి వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్​బాబు తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​ఆవరణలో రూ.142 కోట్ల సింగరేణి నిధులతో ఐదు అంతస్తుల్లో చేపట్టనున్న 355 అదనపు గదుల నిర్మాణ పనులకు మంత్రి, ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​తో కలిసి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్​తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ.10 లక్షలకు పెంచిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో రెండు వేల మంది వినియోగించుకున్నారన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో టెక్నాలజీ వాడుకోవాలని, దానికి అవసరమైన నిధులు సమకూరుస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మెషీన్ ​లెర్నింగ్​పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గ్యాస్​ సబ్సిడీని 24 గంటల్లోనే జమ చేస్తున్నామన్నారు. 

నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇండ్ల స్థలాలు 

రామగుండం ప్రాంతంలో నిరుపేద ఆటో డ్రైవర్లకు ఇండ్ల స్థలాలిస్తామని మంత్రి శ్రీధర్​బాబు హామీ ఇచ్చారు. రామగుండం మెడికల్ కాలేజీకి అనుసంధానంగా నర్సింగ్ కాలేజీని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్పొరేషన్​లో అవసరమైన చోట బస్తీ దవాఖానల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గోదావరిఖనిలోని రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధిపై సింగరేణి దృష్టి పెట్టాలని, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో స్థానిక యువతకు 80 శాతం మేర ఉపాధి కల్పించడంలో సహకరించాలన్నారు. ఆర్ఎఫ్​సీఎల్, ఎన్టీపీసీలు సైతం స్థానిక యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రామగుండంలో యువతకు పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యం కల్పించడం కోసం స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ముందుగా పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ మంజూరు చేశామన్నారు. 

రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​మాట్లాడుతూ సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని పట్టాలు రాని వారికి ఇండ్ల పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేషన్​అభివృద్ధికి మంత్రి శ్రీధర్​బాబు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. మేయర్​అనిల్​ కుమార్, కలెక్టర్​ముజమ్మిల్​ఖాన్, రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​, కార్పొరేషన్​కమిషనర్​ సీహెచ్​శ్రీకాంత్​, సింగరేణి జనరల్​ మేనేజర్లు చింతల శ్రీనివాస్​, ఎల్​వి సూర్యనారాయణ, తహశీల్దార్​ కుమారస్వామి, ఐఎన్​టీయూసీ సెక్రెటరీ జనరల్​ బి.జనక్​ ప్రసాద్, మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్​హిమబిందు సింగ్ పాల్గొన్నారు.