ఆర్టీసీలో నాలుగేండ్లవుతున్నా ఆఫర్ లెటర్లు ఇవ్వలే

 ఆర్టీసీలో  నాలుగేండ్లవుతున్నా ఆఫర్ లెటర్లు ఇవ్వలే

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో నాలుగేండ్ల కింద టీఎస్ పీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన జూనియర్ అసిస్టెంట్లకు ఆఫర్ లెటర్లు ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సెలక్ట్ అయిన 72మంది అభ్యర్థులు పోస్టింగ్ కోసం ఎదు రు చూస్తున్నారు. ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి సమస్య వివరించినా పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. అందరినీ డ్యూటీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కార్పొరేషన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, త్వరలో తీసుకుంటామని కోర్టుకు అధికారులు వివరణ ఇచ్చారు. ఇటీవల అభ్యర్థులు హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఫోన్​లో ఆర్టీసీ అధి కారులను హరీశ్ ఆదేశించారు. అయినా అధికారుల నుంచి స్పందన రాలేదు. మళ్లీ హరీశ్​ను కలవగా.. అధికారులతో మాట్లాడాలని పీఎస్​కు సూచించారు.

ఉద్యోగాల్లో తీసుకోవాలి : అభ్యర్థులు

ఆఫర్ లెటర్ల విషయమై కొన్ని రోజుల కింద ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్, ఈడీ కృష్ణకాంత్​ను పలువురు అభ్యర్థులు కలిశారు. మీ అంశాన్నే పరిశీలిస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. 2014 నుంచి ఆర్టీసీలో రిక్రూట్​మెంట్లు జరగలేదని, ఉన్న ఉద్యోగులను అధికారులు వీఆర్ఎస్​తో పంపారని వివరించారు. ఇటీవల 166 మంది కానిస్టేబుల్స్​ను కారుణ్య నియామకాల కింద తీసుకున్నారన్నారు. ఆర్టీసీలో 4వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వెంటనే తమను డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతున్నారు.