పాంచ్​ పటాకా.. వరంగల్​ నుంచి ఐదుగురికి కార్పొరేషన్‍ పదవులు

పాంచ్​ పటాకా.. వరంగల్​ నుంచి ఐదుగురికి కార్పొరేషన్‍ పదవులు
  • జంగా రాఘవరెడ్డి, ఇనగాల వెంకట్రామిరెడ్డి, పోడెం వీరయ్య, బెల్లయ్య నాయక్‍, ఎండీ.రియాజ్‍

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఐదుగురు నాయకులకు వివిధ కార్పొరేషన్ల కింద నామినేటెడ్​ పదవులు దక్కాయి. రాష్ర్ట ప్రభుత్వం సోమవారం మొత్తం 35 మందికి కార్పొరేషన్ పదవులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఓరుగల్లుకు అత్యధికంగా ఐదుగురికి అవకాశం కల్పించింది. మార్చి 15న ప్రభుత్వం వీరిని నియమిస్తూ ప్రకటన చేసినా ఎలక్షన్​ కోడ్​ఉండడంతో బాధ్యతలు చేపట్టలేదు. ఈక్రమంలో కొందరి పేర్లు మార్చాలంటూ జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి వచ్చినా, మరోసారి అఫీషియల్​గా నియామకం చేపట్టడంతో క్లారిటీ వచ్చింది. వీరు రెండేండ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. 
 
వివిధ నామినేటెడ్​ పోస్టుల్లో.. 

హనుమకొండ జిల్లాకు టేకులగూడెం గ్రామానికి చెందిన జంగా రాఘవరెడ్డికి స్టేట్‍ కో–ఆపరేటివ్‍ ఆయిల్‍ సీడ్స్​గ్రోవర్స్​ఫెడరేషన్‍ లిమిటెడ్‍ చైర్మన్‍గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా మంగపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, మహబూబాబాద్‍ జిల్లాకు చెందిన గిరిజన సీనియర్‍ నేత తేజావత్‍ బెల్లయ్య నాయక్‍కు స్టేట్‍ షెడ్యూల్డ్​ ట్రైబ్స్​కో_ఆపరేటివ్‍ ఫైనాన్స్​ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ కేటాయించారు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి చెందిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి జిల్లాలో కీలకమైన కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) చైర్మన్‍ పదవి ఇవ్వగా, గ్రేటర్‍ వరంగల్‍కు చెందిన ఎండీ.రియాజ్‍ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‍ చైర్మన్‍గా అవకాశం దక్కింది. 

టిక్కెట్ రానోళ్లకు ప్రాధాన్యం..

ఉమ్మడి జిల్లా నుంచి కార్పొరేషన్‍ చైర్మన్‍ పదవులు పొందినవారు సీనియారిటీతోపాటు ఎమ్మెల్యే, లోక్‍సభ ఎన్నికల్లో టిక్కెట్‍ ఆశించి భంగపడ్డవారికి పార్టీ సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. జంగా రాఘవరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‍ పశ్చిమ స్థానం కోసం ప్రయత్నించగా, నాయిని రాజేందర్‍రెడ్డికి అవకాశం దక్కింది. ఇనగాల వెంకట్రామిరెడ్డి పరకాల అసెంబ్లీ స్థానం ఆశించగా, రేవూరి ప్రకాశ్‍రెడ్డికి దక్కింది.

బెల్లయ్య నాయక్‍ మహబూబాబాద్‍ ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్‍ కోసం ప్రయత్నించారు. ఎమ్మెల్యే పోదెం వీరయ్య భద్రచలం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ మిత్రపక్ష సీపీఐ గెలుపొందింది. మైనార్టీ సీనియర్‍ నేతగా ఎండీ.రియాజ్‍ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి అవకాశం దక్కినట్లయింది.