కేసీఆర్​ పాలనలో అవినీతి, అణచివేత: మాయావతి

కేసీఆర్​ పాలనలో అవినీతి, అణచివేత:   మాయావతి

సూర్యాపేట, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందని ఆ  పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ  వర్గాలు ఇంకా వెనకబడి ఉన్నాయని, బీఎస్పీ తోనే సామాజికన్యాయం సాధ్యమవుతందని ఆమె పేర్కొన్నారు. దేశంలో నిమ్నవర్గాలకు రక్షణ లేకుండా పోయిందని, కేసీఆర్​ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆమె విమర్శించారు. బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన  తెలంగాణ భరోసా సభకు ఆమె హాజరై మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అణచివేత, అక్రమాలు బాగా పెరిగిపోయాయని, అధికారంపై ఉన్న ప్రేమ పేదలపై లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షలాది మంది పేదలు వివక్ష, అన్యాయాలకు గురవుతున్నారని అన్నారు.  పథకం ప్రకారమే బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర పన్ని.. తమ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ పై దాడి చేశాయని ఆమె ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ ఈ దేశానికి విలువైన రాజ్యాంగాన్ని అందించారని, తమ పార్టీకి రాజ్యాంగమే మేనిఫెస్టో అని ఆమె స్పష్టం చేశారు.  ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశాయని ఆమె విమర్శించారు. దేశంలో ప్రాంతీయపార్టీలు కూడా బలం పుంజుకుంటున్నాయన్నారు. బీఎస్పీ  అభ్యర్థులందరిని గెలిపించాల్సిన బాధ్యత బహుజనులపై  ఉందన్నారు.

దొరల పాలన పోవాలంటే జానయ్య యాదవ్ ను గెలిపించాలె..

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. దోపిడీకి గురవుతున్న సామాన్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావద్దా? అని  ప్రశ్నించారు. రాష్ట్రంలో మోసపూరిత, దుర్మార్గపు దొరల పాలన పోవాలంటే వట్టే జానయ్య యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఈ పోరాటంలో ఏమైనా  తగ్గేదేలే అని ప్రవీణ్​కుమార్​అన్నారు. ఆ తర్వాత సూర్యాపేట అభ్యర్థి వట్టే జానయ్యయాదవ్, పార్టీ నేతలు మాట్లాడారు.

ALSO READ : 12 గంటలు సోదాలు చేసిన ఆఫీసర్లు.. ఉత్త చేతుల్తో వెళ్లిన్రు : వివేక్ వెంకటస్వామి