ఉమామహేశ్వర్ రావు  ల్యాప్​టాప్​లో అవినీతి గుట్టు

ఉమామహేశ్వర్ రావు  ల్యాప్​టాప్​లో అవినీతి గుట్టు
  • బినామీల పేర్ల మీద భారీగా కూడబెట్టిన ఏసీపీ 
  • డైరీలో పలువురు పోలీసు అధికారుల పేర్లు
  • ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
  • నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన జడ్జి
  • చంచల్​గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి అధికారుల చిట్టా బయటపడుతున్నది. హై ప్రొఫైల్ కేసుల్లో అక్రమాలకు పాల్పడిన పోలీసుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమామహేశ్వర్ రావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్​టాప్, డైరీలో పలువురు ఉన్నతాధికారుల పేర్లు ఉన్నట్టు సమాచారం.

అదేవిధంగా, బినామీల పేర్లతో ఉమామహేశ్వర్ రావు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు తెలుస్తున్నది. బంజారాహిల్స్​లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్​లో బుధవారం మధ్యాహ్నం వరకు ఉమామహేశ్వర్ రావును విచారించారు. తర్వాత నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి జూన్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్​గూడ జైలుకు తరలిచారు. ఉమామహేశ్వర్ రావును మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 22 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా.. దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే 17 స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఆర్థిక లావాదేవీలపై ఎప్పటికప్పుడు నోట్

ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు విచారణలో ఏసీబీ అధికారులు కీలక వివరాలు రాబట్టారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఐగా విధుల్లో చేరిన తర్వాత భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారంలో కొంత మంది పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌, డైరీ కీలకంగా మారింది. ఏ కేసులో.. ఎవరి నుంచి ఎంత తీసుకున్నది.. ఎవరికి ఎంత ఇచ్చిందన్న విషయాలు ల్యాప్​టాప్, డైరీలో ఉన్నట్టు సమాచారం. కేసుల వివరాలు.. వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఉమా మహేశ్వర్ రావు ఎప్పటికప్పుడు రాసిపెట్టుకునేవాడని తెలిసింది. పలువురు కింది, ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఈయన ద్వారా ముడుపులు అందినట్టు తెలుస్తున్నది. ఓ టీమ్​గా ఏర్పడి.. డబ్బులు తీసుకుని కేసులను పక్కదారి పట్టించిన దాఖలాలు కూడా ఉన్నట్టు సమాచారం. 

హై ప్రొఫైల్ కేసులే టార్గెట్

సీసీఎస్‌‌‌‌‌‌‌‌లో హైప్రొఫైల్ కేసులనే ఉమామహేశ్వర్ రావు టీమ్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలిసింది. ఇందులో చాలా కేసుల్లో సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకే ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ప్రయత్నించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొంత మంది పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అవినీతికి సహకరించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. అవినీతితో కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి కొంత మంది పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ సమయంలో ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా సంబంధిత అధికారులను విచారించే అవకాశాలు ఉన్నాయి.