వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా వైద్యారోగ్యశాఖ అక్రమాలకు నిలయంగా మారుతోంది. డ్యూటీ చేయని వారికి, జైలుకు వెళ్లిన వారికి, ఒకరికి బదులు మరొకరు డ్యూటీ చేసిన వారికి జీతాలు ఇచ్చిన ఘటనలపై ఎంక్వైరీ కొనసాగుతుండగానే మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. అద్దె వాహనాల ఏర్పాటులో రూల్స్ ప్రకారం కాకుండా పైరవీలు చేసుకున్న వారికే అవకాశం ఇచ్చారు. మాజీ డీఎంహెచ్‌వో సీసీగా పనిచేసిన ఉద్యోగి ఇందులో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రూల్స్ పక్కన పెట్టి తన కుటుంబ సభ్యులకు చెందిన మూడు కార్లను రెంట్‌కు పెట్టుకున్నాడు. అంతేకాదు ఇందులో ఓ కారుకు డీఎంహెచ్ వో ఆఫీస్ సిబ్బందినే డ్రైవర్‌గా పెట్టి బిల్లులు డ్రా చేసుకోవడం గమనార్హం.
14 అద్దె వాహనాలు
డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో మొత్తం14 అద్దె వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో డీఎంహెచ్ వో ఆఫీస్ కు 3 కార్లు, ఆర్ బీఎస్ కే స్కీమ్‌కు 06, టీ హబ్ కు 04, ఆలన పథకానికి ఒకటి చొప్పున కేటాయించారు. వాస్తవానికి ప్రభుత్వ ఆఫీసుల్లో అద్దె కార్లను పెట్టుకోవాలంటే ముందుగా పత్రిక ప్రకటన ద్వారా టెండర్లను పిలవాలి. తక్కువ రేట్లకు కోట్ చేసిన వారిని అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్ బోర్డు ఉన్న వాహనాలు కాకుండా ట్యాక్స్ బోర్డు ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. నిరుద్యోగ యువత కుటుంబాలకు ఉపాధి ఇవ్వడం కోసం ప్రభుత్వం ఈ రూల్‌ను పెట్టింది. కానీ, జిల్లా వైద్యారోగ్య శాఖలోని కొందరు ఆఫీసర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు.
కుటుంబసభ్యుల కార్లు
వనపర్తి మండల పరిధిలోని ఓ పీహెచ్‌సీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగిని మాజీ డీఎంహెచ్‌వో రూల్స్ విరుద్ధంగా సీసీగా పెట్టుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఉద్యోగి తన కుటుంబసభ్యులకు చెందిన మూడు కార్లను వివిధ పథకాల కింద రెంట్‌కు పెట్టించాడు. టీ హబ్‌లో ఒకే ఓనర్ పేరుతో ఉన్న 2 కార్లు (టీఎస్ 06ఈహెచ్2997, టీఎస్ 31బీ9187) , ఆలన పథకంలో ఒక కారు ( టీఎస్ 10ఈపీ 9646) పెట్టినట్లు రికార్డుల్లో ఉంది. పెద్ద ఆఫీసర్ కూడా తన సొంత కారును పెట్టి.. బిల్లులు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఆలన వెహికిల్‌ను మూలకు పడేసి..
ఆలన పథకానికి ఇదివరకు ఉన్న ప్రభుత్వ వెహికల్ బాగానే ఉన్నా మూలకు పడేశారు. దీని స్థానంలో అద్దె వెహికల్‌ను (టీఎస్ 10ఈపీ 9646) ను నెలకు రూ.40 వేలు చెల్లించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వెహికల్‌కు ఆలన పథకంలో పేషెంట్ కేర్‌గా పనిచేస్తున్న అటెండర్ శ్రీనువాసులును డ్రైవర్‌గా పెట్టుకున్నారు. ఇతను ప్రభుత్వం నుంచి నుంచి జీతం తీసుకుంటూ.. అద్దె వెహికల్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు ఈ వెహికల్‌ను ఆలన పథకానికి సంబంధించిన ఎలాంటి స్టిక్కర్లు, ప్రభుత్వ లోగోలు పెట్టకుండానే కొనసాగిస్తున్నారు.
ఆలన డ్రైవర్‌గా పనిచేస్తున్నది నిజమే
నేను మొదట డీఎంహెచ్ వో ఆఫీస్ లో అటెండర్ గా పనిచేసేవాణ్ణి. జిల్లా ఆస్పత్రిలో ఆలన పథకం స్టార్ట్ అయ్యాక నన్ను పేషేంట్ కేర్‌గా నియమించిన్రు. నాకు డ్రైవింగ్ రావడంతో ఈ యేడు జనవరి నుంచి మాజీ డీఎంహెచ్‌వో సీసీ మహేశ్వరచారి వార్డులో డ్యూటీ బదులు ఆలన వెహికల్ నడపాలని చెప్పిండు.
- శ్రీనివాసులు,
ఆలన పేషెంట్ కేర్, వనపర్తి`
విచారణ చేసి చర్యలు తీసుకుంటం
డీఎంహెచ్ వో ఆఫీస్ లో అద్దె వాహనాల ఏర్పాటు ఎలా జరిగిందో నాకు తెలియదు. టీ హబ్‌లో 4, ఆలనలో 1, ఆర్ బీఎస్ కే లో 6, డీఎంహెచ్ వో ఆఫీస్ 3 చొప్పున అద్దె వాహనాలు కొనసాగుతున్నయి. అద్దె వాహనాల ఏర్పాటు, బిల్లుల చెల్లింపు, అగ్రిమెంట్లు పూర్తిగా పరిశీలిస్తం. అవినీతి జరిగినట్లు విచారణలో తేలితే చర్యలు తీసుకుంటం.
- డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డీఎంహెచ్‌వో ఆఫీస్ ఏవో, టీహబ్ ప్రోగ్రామ్ ఆఫీసర్
