సింగరేణి టెండర్లలో అవినీతి జరుగుతోంది

సింగరేణి టెండర్లలో అవినీతి జరుగుతోంది

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు సాధిస్తామని చెబుతున్నా కేసీఆర్... పీకేను ఎందుకు తెచ్చుకున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పీకేని పిలిపించుకున్నారని ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రూ.20 వేల కోట్లు ఖర్చుపెడితే రాష్ట్రం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయవచ్చని, కానీ ఈ విషయంలో బీజేపీతో కలిసి  కేసీఆర్ డ్రామా ఆడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు జాప్యం వల్ల ఎంతో మంది రైతులు చనిపోయారన్నారు. ఎరువులకు ధరలు పెంచి రైతులను రైతులను అప్పులపాలు చేశారని, మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు అమలు చేయాలన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కోల్ మైన్ టెండర్లలో అవినీతి జరుగుతోందన్నారు. ఆయన బంధువు ప్రతిమా శ్రీనివాస రావుకు నైనీ  కోల్ మైన్ ను కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. కోల్ మైన్ టెండర్ వ్యవహారం కాళేశ్వరం, మిషన్ భగీరథ మించిన మెగా స్కాం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ ను వెంటనే తప్పించి, పారదర్శకంగా టెండర్లు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.

మూసీనదిని ప్రక్షాళన చేయాలి
మూసీ నదిని ప్రక్షాళన చేయాలని వారం కిందట పీఎం మోడీని కలిసి వివరించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. మూసీ నది కలుషితమై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నమామి గంగా పేరుతో గంగా నది ప్రక్షాళనకు కేంద్రం రూ.30 వేల కోట్లు కేటాయించిందని, మూసీ నదికి కనీసం రూ.3 వేల కోట్లైనా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్, విజవాడ హైవేను 6లేన్లు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి లేఖ ఇచ్చినట్లు తెలిపారు. హైవే ఎక్టెన్షన్ కు జీఎంఆర్ ముందుకు రాకుంటే కొత్త కంపెనీకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలని మంత్రికి చెప్పానన్నారు. అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రతి పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటాయని, అవి త్వరలోనే సమసిపోతాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయంలో స్పందించారు. చివరి రక్తపు బొట్టు వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

రేపు పంజాబ్ వ్యాప్తంగా హాలిడే

సామాన్యులకు షాక్.. పెరిగిన వంట గ్యాస్ ధర