
మెదక్/నారాయణఖేడ్, వెలుగు: టీఆర్ఎస్ పాలనలో అవినీతి కుళ్లి కంపుకొడుతోందని, ప్రజాప్రతినిధులంటేనే జనం చీదరించుకునే పరిస్థితి నెలకొందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అధికారాన్ని నిలుపుకోవడంపైనే దృష్టి పెట్టాయితప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు దిక్సూచిగా మారారన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతది
మహాత్మాగాంధీ, ఇందిర, రాజీవ్ దేశం కోసం ప్రాణాలర్పించారని, వారి వారసుడిగా దేశ ప్రయోజనాల కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని రేవంత్ అన్నారు. నిఘా సంస్థలు రాహుల్ ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరించినా, కేంద్రం ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టినా ధైర్యంగా యాత్ర మొదలు పెట్టారని చెప్పారు. తమ సమస్యలు, బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న ప్రజలకు రాహుల్ ఆశాకిరణంలా మారారన్నారు. భారత్ జోడో యాత్ర క్విట్ ఇండియా ఉద్యమ తరహాలో చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పారు.
నేడు భారత్ జోడో గర్జన సభ
రాహుల్ యాత్ర రాష్ట్రంలో ఆశించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యిందని రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ లో భారత్ జోడో గర్జన పేరుతో భారీ ఎత్తున విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు భారీ ఎత్తున ప్రజలు సభకు తరలిరానున్నట్టు చెప్పారు. సమావేశంలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, సుబ్బిరామిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.