
- మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
- ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
- పేదలను కేసీఆర్ అరిగోస పెడుతున్నడు
- రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని ఫైర్
నిర్మల్/భైంసా/మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని.. ఊళ్లలో గుడి, బడి లేకపోయినా బెల్టు షాపులు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నాయని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. లిక్కర్, డ్రగ్స్, ఇసుక.. ఇలా అన్ని దందాల్లోనూ సీఎం కేసీఆర్ కు వాటా ఉందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలనకు ముగింపు పలకాలని.. ఇందుకోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో సంజయ్ పాదయాత్ర చేశారు. గుండంపల్లి వద్ద ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి, దిలావర్పూర్దగ్గర సభలో మాట్లాడారు. తెలంగాణ వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని సంజయ్ అన్నారు.
‘‘డబుల్బెడ్రూమ్ ఇండ్లు రాలేదు. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. రుణమాఫీ కాలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగ భృతి లేదు. మూడు నెలలుగా ఆసరా పింఛన్లు కూడా ఇస్తలేరు” అని ఫైర్ అయ్యారు. పేదలను కేసీఆర్ అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ లో పంటలు పండిస్తున్న కేసీఆర్ కోటీశ్వరుడైతే.. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు బికారీలు ఎందుకు అవుతున్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవితకు సీబీఐ నోటీసులిస్తే, తెలంగాణ అంతా ఎందుకు ధర్నా చేయాలని నిలదీశారు. ‘‘కేసీఆర్ వేల కోట్లు దోచుకుండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాడు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని అన్నారు.
పంట నష్టం పైసా ఇయ్యలే..
వడ్ల కొనుగోళ్లకు సంబంధించి నిధులన్నీ కేంద్రమే ఇస్తోందని, ఇందులో కేసీఆర్ చేస్తున్నదేమీ లేదని సంజయ్ అన్నారు. కేంద్రం ఎరువులపై సబ్సిడీ ఇస్తుంటే.. కేసీఆర్ మాత్రం రైతుబంధు ఇచ్చి సబ్సిడీలన్నీ బంజేశారని మండిపడ్డారు. ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ‘‘ఎనిమిదేండ్ల నుంచి పంట నష్టపోయిన రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. గిట్టుబాటు ధర కోసం గొంతెత్తిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌ది. ప్రజల కోసం కొట్లాడితే నన్ను కూడా మూడ్రోజులు జైలుకు పంపారు. అరెస్టులకు మేం భయపడం” అని అన్నారు. ‘‘ఇప్పటి వరకు 37 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు, స్వర్ణకారులు, చేనేత కార్మికులు పేదరికంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ కుటుంబాలను కేసీఆర్ ఆదుకోలేదు. కనీసం పరామర్శించలేదు” అని ఫైర్ అయ్యారు. పేదోళ్లంతా కలిసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పెద్దోడు రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, యాత్ర సహ ప్రముఖ్ వీరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
కష్టపడితే మూడు సీట్లు మనవే..
నిర్మల్ జిల్లా రాంపూర్‌లోని పాదయాత్ర శిబిరం వద్ద మంచిర్యాల జిల్లా ముఖ్య నేతలతో సంజయ్ సమావేశమయ్యారు. జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా చూస్తున్నారని, స్థానిక సమస్యలపై పోరాడాలని సూచించారు. టీఆర్ఎస్లో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని కొందరు నాయకులు చెప్పారు. ‘‘కేసులకు భయపడొద్దు. తెగించి కొ ట్లాడాలే. ఇంట్లో కూర్చుంటే గెలవలేం. అవసరమైతే జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉండాలి” అని సంజయ్ సూచించారు. దిలావర్ పూర్లో భైంసా మున్సిపల్ కౌన్సిలర్లతోనూ సంజయ్ భేటీ అయ్యారు.
రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న 26లక్షల మంది దివ్యాంగుల్లో 44శాతం మందికి ఇంకా పింఛన్లు రావడం లేదని శనివారం ప్రకటనలో ఆయన వెల్లడించారు.
సైకిల్ కొనిస్తా.. ఇంటికి రా..
పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని బామ్నిలో పోసాని ఇంటికి సంజయ్ వెళ్లారు. ఆయన కుటుంబం గుడిసెలో ఉంటుండగా, లోపలికి వెళ్లిన సంజయ్.. పోసాని కొడుకు రాంచరణ్‌తో ముచ్చటించారు. ‘‘నువ్వు నా ఫ్రెండ్” అంటూ పిల్లాడికి భరోసా ఇచ్చారు. ‘‘నువ్వు స్కూల్‌కు వెళ్తున్నావా?’’ అని సంజయ్ అడ గ్గా.. ‘‘వెళ్తున్నాను. నాకో సైకిల్ కావాలి” అని రాంచరణ్ అడిగాడు. దీంతో సైకిల్ కొని స్తానని సంజయ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని తన ఇంటికి రావాలని చెప్పారు.