రైతులు అమ్ముకున్నంక.. రేటు పెంచిన్రు.. రూ. 2500 నుంచి 5900కి పెంపు

రైతులు అమ్ముకున్నంక.. రేటు పెంచిన్రు.. రూ. 2500 నుంచి 5900కి పెంపు
  • ప్రైవేటు వ్యాపారులు, దళారుల దెబ్బకు మునిగిన పత్తి రైతులు
  • సీజన్​ మొదట్లో రూ.2,500 నుంచి 4 వేలలోపే రేటు
  • ఇప్పుడు క్వింటాల్​ రూ.5,900 వరకు పలుకుతున్న ధర
  • అప్పుడు సీసీఐ ఆఫీసర్లు, వ్యాపారులు కుమ్మక్కై రేటు తగ్గించారన్న ఆరోపణలు
  • తేమ శాతం, రంగు మారిందంటూ సాకులు
  • వచ్చిన రేటుకు పంటంతా అమ్ముకున్న రైతులు
  • పెట్టుబడి కూడా దక్కక నష్టపోయినమని ఆవేదన
  • ఇంటర్నేషనల్​ డిమాండ్​తోనే రేటు పెరిగిందంటున్న వ్యాపారులు

వరంగల్/ వెలుగు నెట్ వర్క్: ప్రతిసారి లాగానే ఈసారి కూడా పత్తి రైతు దెబ్బతిన్నడు. సర్కారు నిర్లక్ష్యం.. సీసీఐ ఆఫీసర్లు, దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రేటు తగ్గించేయడంతో నిండా మునిగిండు. పంటంతా మార్కెట్​కు పోటెత్తిన అసలు టైంలో ఏవేవో సాకులు చెప్తూ అగ్గువ రేటు కట్టిన వ్యాపారులు.. ఇప్పుడు రైతులు పత్తి అంతా అమ్మేసుకున్నంక రేటు పెంచిన్రు. 90 శాతం పత్తిని క్వింటాల్​ రూ.2,500 నుంచి రూ.4 వేలలోపే రేటుకే చేజిక్కించుకున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కక రైతులు నష్టపోయారు. పంట వ్యాపారుల చేతికి వెళ్లగానే రేట్లు పెంచేశారు.  ఇప్పుడు ధర రూ.5,900కు పెరిగింది. వ్యాపారులు, సీసీఐ ఆఫీసర్లు కుమ్మక్కయ్యారని.. రైతుల దగ్గర తక్కువ రేటుకు కొన్న పత్తిని ఎక్కువ రేటుకు సీసీఐ కొన్నట్టుగా చూపి.. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అటు కుండపోత వానలతో పంట దెబ్బతిని నష్టపొయినమని, ఇటు తక్కువ రేటుకు అమ్ముకోవడం వల్ల నిండా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

60 లక్షల ఎకరాల్లో సాగు

ఈ వానాకాలం సీజన్​లో రైతులు స్టేట్​వైడ్​ 60 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు. ఎకరాకు సగటున 10 నుంచి 12 క్వింటాళ్ల చొప్పున 65 నుంచి 78 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని మొదట్లో ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ భారీ వర్షాలు, చీడపీడల కారణంగా సగటున ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల చొప్పున 24 నుంచి 30 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గత అక్టోబర్​ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 110 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరిపింది.

తేమ సాకుతో రేటు పెట్టక..

సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేసినా ఆఫీసర్లు పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెడుతూ వచ్చారు. క్వాలిటీ కాటన్​ను మాత్రమే,  కొద్దికొద్దిగానే కొన్నారు. కేంద్రం క్వింటాల్​పత్తికి రూ.5,825 మద్దతుధర ప్రకటించినా రైతులెవరికీ ఆ రేటు దక్కలేదు. ప్రైవేటు వ్యాపారులు, దళారులు కలిసి.. పత్తి కలర్​ మారిందని, తేమ శాతం ఎక్కువుందని చెప్తూ క్వింటాల్​ రూ.4 వేలలోపే రేటు పెట్టారు. కీలకమైన ఖమ్మం, ఏనుమాముల (వరంగల్), జమ్మికుంట, పెద్దపల్లి, ఆదిలాబాద్​ తదితర మార్కెట్లలో.. అక్టోబర్ నుంచి డిసెంబర్​ వరకు సగటున మూడు వేలే రేటు చెల్లించారు. గరిష్టంగా రూ.4,500 వరకే ఇచ్చారు. తర్వాత చలి, పొగమంచుతో పత్తిలో తేమ శాతం పెరగడం, నిల్వ చేసిన పత్తి రంగుమారడం వంటి కారణాలతో తక్కువ రేటే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక రైతుల నుంచి తక్కువ రేటుకు కొన్న పత్తిని వ్యాపారులు, సీసీఐ ఆఫీసర్లు కుమ్మక్కై ఎక్కువ రేటుతో సీసీఐకి విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి.

సీజన్ ఎండింగ్​లో పెరుగుతున్న రేట్లు

ప్రస్తుతం పత్తి సీజన్​దాదాపుగా దగ్గరపడింది. రైతులు ఇప్పటికే 90శాతం పంటను అమ్ముకున్నారు. వరంగల్​లోని ఏనుమాముల మార్కెట్​కు నవంబర్, డిసెంబర్​ నెలల్లో సగటున రోజూ 50 వేల వరకు పత్తిబస్తాలు రాగా.. ఇప్పుడు 8 వేల బస్తాలే వస్తున్నాయి. ప్రస్తుతం సీసీఐ మద్దతు ధర తగ్గించి గరిష్టంగా రూ.5,615 రేటు ఇస్తుంటే.. వ్యాపారులు మాత్రం ఏకంగా రూ.5,900 దాకా చెల్లిస్తున్నారు. సోమవారం గరిష్టంగా క్వింటాల్​కు పెద్దపల్లిలో రూ.5,850, జమ్మికుంటలో 5,900, ఆదిలాబాద్​లో 5,725, ఖమ్మంలో 5,800, ఏనుమాముల(వరంగల్​)లో రూ.5,900 చొప్పున ఇచ్చారు. ఇంటర్నేషనల్​ మార్కెట్లో పత్తి బేళ్లకు డిమాండ్​ పెరగడమే.. ఇక్కడ రేటు పెరగడానికి కారణమని ఆఫీసర్లు, వ్యాపారులు అంటున్నారు. నూనెల తయారీలో వినియోగించే పత్తి గింజలకు కూడా రేటు పెరిగిపోయిందని చెప్తున్నారు. ఇదివరకు క్వింటాల్​కు రూ.2,250 దాకా పలికిన గింజలు ఇప్పుడు రూ.2,450కిపైగా పలుకుతున్నాయని వివరిస్తున్నారు. సీజన్​ మొదట్లో అంతా కలిసి కుమ్మక్కై.. కావాలనే ఏవేవో కొర్రీలు పెడ్తూ రేట్లు తగ్గించారని రైతులు మండిపడుతున్నారు. పత్తి అంతా వ్యాపారుల చేతికిపోయాక రేటును మామూలు స్థాయికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారులకే మేలు..

సీసీఐ లెక్కల ప్రకారం ఇప్పటికే సుమారు 20 లక్షల క్వింటాళ్ల పత్తి ప్రైవేట్​ జిన్నింగ్​ మిల్లులు, గోడౌన్లకు చేరింది. ఇక క్వింటాల్​పై ఎంత పెరిగినా ఆ లాభమంతా వ్యాపారులు, దళారుల ఖాతాల్లోకే చేరిపోతుంది. మొదటి నుంచీ సీసీఐ ఆఫీసర్ల తీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. రకరకాల కొర్రీలతో రైతులు తెచ్చిన కాటన్​ను ఆఫీసర్లు తిరస్కరించడం, అదే పత్తిని వ్యాపారులు తక్కువ ధరకు కొని తిరిగి సీసీఐకి మద్దతు ధరకు అమ్ముకుంటున్నారనే ఫిర్యాదులున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్​ మార్కెట్​లో కాటన్ బేళ్లకు డిమాండ్​ పెరగడంతో డైరెక్ట్​ ఎక్స్​పోర్ట్​ చేసే వ్యాపారులు ఒక్కసారిగా అలర్ట్​ అయ్యారు. మార్కెట్లకు పత్తి తక్కువగా వస్తుండడంతో వీలైనంత పోటీపడి మరీ కొంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సీసీఐ మద్దతు ధరను రూ.5615కు తగ్గించగా, వ్యాపారులు మాత్రం ఏకంగా రూ.5900 వరకు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు సీసీఐకి కాకుండా వ్యాపారులకే అమ్ముతున్నారు. దీంతో డిమాండ్​ పెరిగిన తర్వాత వ్యాపారులు, దళారులకు మేలు చేసేందుకే సీసీఐ ఇప్పుడు మద్దతు ధర తగ్గించిందనే విమర్శలు వస్తున్నాయి.

రేటు ఇంకా పెరుగుతది

ఇంటర్నేషనల్​ మార్కెట్లో కాటన్​కు డిమాండ్​ పెరిగింది. గింజల రేటు కూడా ఎక్కువే పడుతోంది. దీంతో వ్యాపారులు క్వింటాల్​కు రూ.5,900 దాకా పెడుతున్నరు. ఇక ముందు కూడా పత్తికి రేటు పెరిగే చాన్స్​ ఉంది.

– బి.వి.రాహుల్, ఏనుమాముల మార్కెట్ సెక్రటరీ, వరంగల్

అమ్ముకున్నంక పెరగవట్టె..

ఏడెకరాల్లో పత్తి పెట్టిన. వానలతో దిగుబడి రాలే. గిట్టుబాటు ధర రాలే. సీసీఐ ఆఫీసర్లు కొనక దళారులకు క్వింటాల్​కు రూ.3,400కి 15 క్వింటాళ్లు అమ్మిన. తీరా రైతులందరూ అమ్ముకున్నంక ఇప్పుడు రేట్లు పెరగవట్టె.

– మాదాసు కిష్టయ్య, పాలకుర్తి, పెద్దపల్లి జిల్లా

అగ్గువకు అమ్ముకున్న

మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేసిన. వానలతో పంట నాశనమైంది. సర్కారు పరిహారం ఇయ్యలే. వచ్చిన కొద్దిపాటి పత్తికి వ్యాపారులు క్వింటాల్​ రూ. 2,800 కట్టి ఇచ్చిన్రు. ఇప్పుడు రేట్లు పెరిగినయని అంటున్నరు.

– ఊసకోయిల మొండయ్య, రాయికల్, కరీంనగర్​ జిల్లా

తక్కువ రేటుకే అమ్మాల్సి వచ్చె..

నవంబర్  మొదటి వారంలో పత్తి క్వింటాల్​ రూ.2,500 రేటుకే అమ్మాల్సి వచ్చింది. వర్షాలతో పత్తి తడిసిందని, నల్లగా అయిందని వంకలు పెట్టిన్రు. ముందు క్వింటాల్​ రూ.2,800 లెక్కన బేరమాడి కూడా కాంటా వేసేటప్పుడు కిరికిరి పెట్టి రూ.2,500 లెక్కనే తీసుకున్నరు. తేమశాతం ఎక్కువుందని, ఇంకేదో అని కారణాలు చెప్పిన్రు.

‑ గుగులోతు కృష్ణ, మల్లెపల్లి, కొణిజర్ల మండలం, ఖమ్మం

For More News..

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్

రాష్ట్రంలో నిలిచిపోయిన డయాలసిస్ సేవలు!

వ్యాక్సిన్​కు జనాలు ముందుకొస్తలే

కొడుకును తర్వాత సీఎం చేసుకో ముందు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు