పత్తి రైతుకు దిగుబడి టెన్షన్‌‌..ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌తో ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లకే పరిమితం

పత్తి రైతుకు దిగుబడి టెన్షన్‌‌..ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌తో ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్లకే పరిమితం
  •     పెరిగిన కూలీ, ఎరువులు, పురుగు మందుల ఖర్చులు
  •     నేటికీ షురూ కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు
  •     ఇదే అదనుగా రేటు తగ్గిస్తున్న దళారులు

 హైదరాబాద్‌‌, వెలుగు: పత్తి రైతుకు ఈసారి దిగుబడి టెన్షన్‌‌ పట్టుకున్నది. ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో పడకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, తెగుళ్లతో పంట దెబ్బతినడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. పంట ఎదుగుదల సరిగా లేకపోవడంతో రైతులు ఎరువులు, పురుగు మందులు, కూలీలపై భారీగా ఖర్చు చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో పూత, పిందె రాలేదు. దీంతో ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి రావడమే కష్టంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేటికీ సీసీఐ  కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ఇదే అదనుగా దళారులు రేటు తగ్గిస్తుండడంతో రైతులు నిండా మునుగుతున్నారు.

 మొదట్లో ఆశలు.. తర్వాత నిరాశ

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 48.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గతేడాది పత్తికి కొంత మేర మంచి ధర లభించడంతో ఈసారి రైతులు పత్తి సాగుపై ఎక్కువగా ఆసక్తి చూపారు. మే చివరి నుంచే భూములను సిద్ధం చేసుకొని విత్తనాలు వేశారు. తొలకరి వర్షాలతో విత్తనాలు మొలకెత్తడంతో పంటపై ఆశలు పెరిగాయి. అయితే ఆ తర్వాత వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పంట పెరుగుదల మందగించింది. 

కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు తిరిగి విత్తనాలు వేయాల్సి వచ్చింది. వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక ఉష్ణోగ్రతలు పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. పూత, పిందెలు రాలిపోవడంతో పాటు వివిధ రకాల తెగుళ్లు ఆశించాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు అదనంగా నీటితడులు ఇవ్వడంతోపాటు పురుగు మందులు స్ప్రే చేశారు. అయినా పంటలో ఆశించిన పెరుగుదల కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో పంట పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు మేతగా వదిలేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.

 పెట్టుబడి బారెడు.. దిగుబడి మూరెడు

పత్తి సాగుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చయిందని రైతులు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు కూలీల రేట్లు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. పంటను కాపాడుకునేందుకు అదనపు ఖర్చులు చేయాల్సి రావడంతో పెట్టుబడి మరింత పెరిగింది. అయితే దిగుబడి మాత్రం ఎకరాకు మూడు నుంచి నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమవుతోందని రైతులు వాపోతున్నారు. 

కొంతమేర పంట మంచిగా ఉన్న ప్రాంతాల్లోనూ ఐదు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. దీనికితోడు పత్తి ఏరడానికి కూలీలకు కిలోకు రూ.14 నుంచి రూ.15తో పాటు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వానాకాలంతో పోలిస్తే ఈసారి పత్తి చేనులో మొక్కల పెరుగుదల అంతంతమాత్రంగానే ఉందని రైతులు పేర్కొంటున్నారు. 

గత సీజన్‌‌లో 45.99 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ఈసారి సాగు విస్తీర్ణం 48.33 లక్షల ఎకరాలకు పెరిగింది. అయితే విస్తీర్ణం పెరిగినా ఎల్‌‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. దిగుబడి గణనీయంగా తగ్గితే రైతులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది. తగ్గిన దిగుబడులు, మార్కెట్‌‌లో ధరల ఒడిదుడుకులతో పత్తి రైతులు ఈ సీజన్‌‌లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

మార్కెట్​లో ధరపైనా దిగులు

దిగుబడి తగ్గడంతో పాటు పత్తికి మార్కెట్‌‌లో ఆశించిన ధర లభించకపోవడం రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం మీడియం స్టేపుల్‌‌ పత్తికి క్వింటాల్‌‌కు రూ.8,267, లాంగ్‌‌ స్టేపుల్‌‌ పత్తికి రూ.8,667గా ఉంది. బహిరంగ మార్కెట్‌‌లో క్వింటాల్‌‌కు రూ.9 వేల వరకు ధర పలుకుతుందని రైతులు ఆశించారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో నాణ్యత, తేమ తదితర కారణాలు చూపుతూ క్వింటాల్‌‌కు మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో అంతంతమాత్రంగా వచ్చిన దిగుబడికి తోడు ధర తక్కువగా రావడంతో నష్టాలు తప్పేలా లేవని వాపోతున్నారు.

సీసీఐ కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు

మరోవైపు పత్తి కొనుగోళ్లపై రైతుల్లో ఆందోళన నెలకొంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. అత్యవసరంగా డబ్బు అవసరమైన రైతులు దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, నాణ్యత పేరుతో ధర తగ్గించకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.