ఓటీపీ వస్తున్నా.. స్లాట్ బుక్ కావట్లే!..యాప్ ప్రాబ్లమ్స్ తో పత్తి రైతులకు ఇబ్బందులు

ఓటీపీ వస్తున్నా.. స్లాట్ బుక్ కావట్లే!..యాప్ ప్రాబ్లమ్స్ తో పత్తి రైతులకు ఇబ్బందులు
  • ఆన్​లైన్​లో సరిగా నమోదుకాని పంట వివరాలు
  •  సీసీఐ సెంటర్లకు వెళ్తే ఎదురొస్తున్న కష్టాలు 
  • ఇదే సమస్యతో ప్రతి సెంటర్ కు రోజూ పదిమందిపైగా రైతుల రాక

మహబూబ్​నగర్, వెలుగు : పత్తి రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్ తో కష్టాలు పడుతున్నారు. సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సెంటర్లలో మద్దతు ధర రూ.8,100కు అమ్ముకుందామంటే నిరాశే ఎదురవుతోంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్ లో స్లాట్ బుక్ కావడం లేదు.  ఆన్​లైన్​లో  కొందరు రైతుల వివరాలు సరిగా అందుబాటులో లేవు. మొబైల్​కు ఓటీపీ వస్తున్నా.. కానీ.. స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు  కొందరికి ‘ఫార్మర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్’ అని .. మరికొందరికి ‘ఫార్మర్ ఈజ్ ఆల్ రెడీ రిజిస్టర్డ్ విత్ బార్ కోడ్’ అని వస్తుంది. దీంతో రైతులు సీసీఐ సెంట్లర్లలో పత్తిని ఎలా అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేదేమీ లేక కొందరు రైతులు రూ.6,500కు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు.

ఏటా పంటల సీజన్ లో వివరాల నమోదు

వ్యవసాయ శాఖ ఏటా పంటల సీజన్​లో క్రాప్ బుకింగ్ ప్రోగ్రామ్ చేపడుతుంది. రైతు పేరు, పొలం ఎంత ఉంది,  ఏం పంట సాగు చేశాడు, దిగుబడి ఎంత వస్తుంది, ఆధార్, ఫోన్ నంబర్లను సేకరించి ఆన్​లైన్​లో ఎంట్రీ చేస్తుంది. తద్వారా  ఏ పంట ఎంత సాగవుతుంది, దిగుబడి ఎంత వస్తుంది అనే వివరాలను అంచనా వేస్తుంది. ఆ ఆన్​లైన్​ డేటాను మార్కెటింగ్ శాఖ తీసుకుని సీసీఐ సెంటర్లలో పత్తి కొనుగోలు చేస్తుంది. అయితే నిరుడు రైతుల నుంచి సీసీఐ నేరుగా పత్తిని కొనుగోలు చేసింది. 

వ్యవసాయాధికారుల నుంచి రైతులు అనుమతి పత్రాలు తీసుకెళ్లినా కొన్నది. కానీ.. ఈసారి కపాస్ యాప్​ను తేగా.. సీసీఐ సెంటర్లలో పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా రైతులు యాప్​లో స్లాట్ బుక్​చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆన్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. కాగా.. రైతులకు యాప్ లో స్లాట్ బుకింగ్ ఇబ్బందిగా మారింది. నంబరు ఎంట్రీ చేయగానే వివరాలను డిస్​ప్లేలో చూపుతుంది. ఓటీపీ ఎంట్రీ చేశాక స్లాట్ బుక్ చేసుకుంటే ఇది వరకే ఆన్​లైన్​లో రిజిస్ర్టర్ అయినట్లు, కాసేపటి తర్వాత ప్రయత్నిస్తే, వివరాలు రిజిస్ర్టర్ కాలేదని చూపుతోంది. 

దీంతో స్లాట్ బుక్ కాక  రైతులు పత్తిని అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సెంటర్ వద్దకు రోజూ 15 నుంచి 20 మంది ఇదే సమస్యతో వస్తున్నారు. స్లాట్ బుక్ కాకపోవడానికి టెక్నికల్ ప్రాబ్లమ్ ఉండొచ్చని సీసీఐ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్​లైన్​లో రైతుల వివరాలు సరిగా లేకున్నా.. కాదంటున్నారు.  సమస్యతో వెళ్లే రైతులకు మాత్రం అధికారులు పరిష్కారం చూపడం లేదు. మూడు, నాలుగు రోజుల తర్వాత రావాలని సమాధానం చెప్పి పంపిస్తున్నారు. 

మా తప్పేమి లేదంటున్న ఆఫీసర్లు 

వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ విభాగాల ఆఫీసర్ల మధ్య పత్తి రైతులు నలిగిపోతున్నారు. తమకు స్లాట్ బుక్​కాకపోవడానికి కారణాలేంటని రైతులు మార్కెటింగ్ ఆఫీసర్లను ప్రశ్నిస్తే.. ‘ మా తప్పేమి లేదు.. వెళ్లి  వ్యవసాయ ఆఫీసర్లను అడగండి’ అని చెబుతున్నారు. అక్కడికి వెళితే ‘మా తప్పేమీ లేదు. సీసీఐ వాళ్లకే తెలుసు. రైతుల డేటాను ఎప్పుడో మార్కెటింగ్ శాఖకు పంపించాం. వెళ్లి వాళ్లనే అడగండి’ అని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. దీంతో చేసేది లేక రైతులు ప్రైవేట్​వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. 

అవగాహన లేక గందరగోళం

కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేక గందరగోళం నెలకొంది. ఒక ఎకరాకు12 క్వింటాళ్ల చొప్పున మాత్రమే సెంటర్ లో పత్తి కొనాలనే రూల్ ఉంది. ఇది తెలియక చాలా మంది రైతులు  దిగుబడి మొత్తం తీసుకెళ్తున్నారు. సెంటర్ లో పత్తి కాంటా వేశాక.. రూల్ మేరకు మిగతాది తీసుకోవడం లేదు. దీంతో తిరిగి తీసుకెళ్తున్నారు. ఈ పత్తిని కూడా రెండోసారి స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ సెంటర్ అమ్ముకోవచ్చు. ఈ విషయంపై అవగాహన లేక, కల్పించకపోతుండగా సెంటర్లకు పత్తిని తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఆన్ లైన్ లో నా పేరు లేదంట.. 

ఎకరంన్నర భూమిలో పత్తి వేసినం. రూ.50 వేల దాకా పెట్టుబడి పెట్టినం. రెండు రోజుల కింద సీసీఐ సెంటర్ లో పత్తి అమ్ముదామని ఫోన్లో స్లాట్ బుక్ చేసుకుంటే అయితలేదు. సీసీఐ సెంటర్ కు పోయి ఆఫీసర్లను అడిగితే ఆన్​లైన్​లో పేరు లేదని చెప్పారు. అగ్రికల్చర్ ఆఫీసర్​ను అడిగితే మార్కెటింగ్ శాఖకు పంపించామన్నారు. ఏం చేయాలో అర్థమైతలేదు.– లక్ష్మి, అమ్మాపూర్, చిన్నచితకుంట మండలం

యాప్​తో తిప్పలు పడుతున్నం

నాకున్న మూడెకరాల్లో పత్తి వేసిన. వానలతో దిగుబడి మంచిగా రాలేదు. వచ్చిన పత్తిని సీసీఐ సెంటర్ లో  అమ్ముకుందామంటే యాప్​తో తిప్పలు పడుతున్నం. స్లాట్ కోసం ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా బుక్ అయిత లేదు. ఆఫీసర్లను అడిగితే ఏం సమాధానం చెప్తలేరు. – కురుమూర్తి, చక్రాపురం,  మూసాపేట మండలం