కొంటరా.. కొనరా?: కంది, పత్తి రైతుల ఆందోళన

కొంటరా.. కొనరా?: కంది, పత్తి రైతుల ఆందోళన

నారాయణపేట, సిద్దిపేటలో కంది రైతుల ఆందోళన
సుల్తానాబాద్​లో రోడ్డుపై పత్తి రైతుల బైఠాయింపు

నారాయణపేట టౌన్, హుస్నాబాద్,​వెలుగు: రైతులు పండించిన కందులను కొనాలంటూ నారాయణపేట, సిద్దిపేట జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో రెండో రోజు రైతులు రాస్తారోకో చేపట్టారు. కందులు కొంటామని మార్క్​ఫెడ్​ అధికారులు టోకెన్లు ఇచ్చి చేతులెత్తేయడంతో మొదటిరోజు రాస్తారోకో చేశారు. దాంతో కందులు కొంటామని అధికారులు హామీ ఇచ్చారు. రెండో రోజు శుక్రవారం సైతం కొనుగోలుకు అధికారులు ముందుకు రాకపోడంతో  ఆగ్రహంతో రైతులు తిరిగి రోడ్డుపైకి చేరుకున్నారు. రైతులను మోసం చేయటం సరికాదని, కలెక్టర్​ వచ్చి కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామంటూ ఐదు గంటలపాటు బైఠాయించారు. రైతులతో ఆర్డీవో శ్రీనివాస్​ చర్చించినా వినిపించుకోలేదు. టోకెన్లు ఇచ్చినవారి దగ్గర సోమవారం నుంచి కందులు కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పిన మాటను డీఆర్వో రవికుమార్​ రైతులకు చెప్పడంతో రాస్తారోకో విరమించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన కందులను అధికారులు కొనడం లేదని శుక్రవారం ఆఫీసు ఎదుట రైతులు ఎడ్లతో సహా వెళ్లి ఆందోళన చేశారు. అన్ని పత్రాలు తీసుకువచ్చిన తర్వాత మాయిశ్చర్​12 శాతం లేదంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. చేర్యాల వ్యవసాయ మార్కెట్​లో అమ్మకానికి తెచ్చిన కందులను కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో రైతులు మార్కెట్​ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్​శైలజ అక్కడికి చేరుకుని రెండు రోజుల్లో రైతులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్​లో నమోదు చేస్తామని, కందులను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆన్ లైన్​లో  రైతుల వివరాలు లేవనే సాకుతో కందులను కొనుగోలు చేయడం లేదని బెజ్జంకి మార్కెట్ యార్డులో  కంది రైతులు ఆందోళన చేశారు.

సుల్తానాబాద్, వెలుగు: కౌలు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయకపోవడంతో రాస్తారోకోకు దిగారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని చిన్నకల్వల గ్రామ శివారులోని జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఈ కేంద్రంలో రైతులు కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరకు పత్తి అమ్ముతున్నారు. ఇటీవల సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త కార్యదర్శి నియామకం అయ్యారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో అధికారులు కొత్త నిబంధనలు రైతుల ముందు పెట్టారు. కౌలు రైతులు తెచ్చిన పత్తి కొనుగోలు చేయమని, సుల్తానాబాద్ మార్కెట్ పరిధి రైతుల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని షరతు విధించారు. పత్తి వాహనాలతో రైతులు శుక్రవారం ఉదయం రాగా మధ్యాహ్నం దాటినా కొనుగోలు చేయలేదు. పెద్దపల్లి పత్తి మార్కెట్ లో వ్యాపారుల సిండికేట్ వల్ల క్వింటాలుకు రూ.4500 మాత్రమే చెల్లిస్తున్నారని, సీసీఐ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర రూ.5,450 చెల్లించడం వల్ల తాము ఇక్కడ అమ్మేందుకు ఆసక్తి చూపాల్సి వస్తోందని రైతులు పేర్కొన్నారు. ఏఎంసీ అధికారుల వైఖరికి నిరసనగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

దీంతో కరీంనగర్, గోదావరిఖని మార్గంలో చాలాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో రైతులు, ఏఎంసీ అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సుల్తానాబాద్, పొతకపల్లి, జూలపల్లి ఎస్సైలు చేరుకొని రైతులను శాంతింపజేశారు. పారదర్శకత కోసమే నిబంధనలు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఏఎంసీ కార్యదర్శి పద్మావతి అన్నారు. ప్రస్తుతానికి ఈ రోజు తెచ్చిన పత్తిని కొనుగోలు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టరు ను సంప్రదించి మళ్లీ కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. తాము చెప్పేవరకు రైతులు పత్తిని తీసుకురావద్దని సూచించారు.

మరిన్ని వార్తల కోసం