పత్తి అమ్మాలంటే.. పక్క జిల్లాలకు!..

పత్తి అమ్మాలంటే..  పక్క జిల్లాలకు!..
  •  కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్లే
  •   మెదక్​ జిల్లాలో 34,903 ఎకరాల్లో పత్తి సాగు
  •   భారీ వానలతో దెబ్బతిన్న పంట
  •   తగ్గనున్న దిగుబడి

మెదక్, వెలుగు:  ఈ మెదక్​ జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు పరేషాన్ అవుతున్నారు. భారీ వర్షాల వల్ల పంట నీటమునిగి, పత్తి కాయలు రంగు మారాయి. ఫలితంగా దిగుబడి తగ్గనుండగా.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల పంటను అమ్ముకునేందుకు ఇబ్బంది తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, నిజాంపేట, రామాయంపేట, నార్సింగి, చేగుంట, శివ్వంపేట, చిలప్​చెడ్, కౌడిపల్లి తదితర మండలాల్లో 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి పంట వేశారు. 

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే, ఈసారి వానాకాలం ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంట ఎదుగుదలపై ప్రభావం చూపాయి. ఆ తర్వాత భారీ వర్షాలు, వరదల వల్ల పత్తి పంట నీట మునిగింది. కాయలు నల్లగా మారాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈసారి పత్తి దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

దూరభారం.. ట్రాన్స్ పోర్టు అదనం 

సీసీఐ పత్తి ధర క్వింటాల్​కు పింజ రకం రూ.8,110, బీబీ స్పెషల్ రకం రూ.8,060, ఎంఈసీహెచ్ రకం రూ.8,010 గా నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించే పత్తికి ఈ ధర లభిస్తుంది. అయితే మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్ల రైతులు పత్తి అమ్ముకునేందుకు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని జిన్నింగ్ మిల్లులకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల దూరభారంతోపాటు  ట్రాన్స్ పోర్ట్ చార్జీలు గుదిబండగా మారుతున్నాయి. అటు దిగుబడి తగ్గుతుండటం, ఇటు ట్రాన్స్ పోర్ట్ చార్జీల కారణంగా తమకు నష్టమే తప్ప లాభం లేదని రైతులు వాపోతున్నారు. 

జిన్నింగ్ మిల్లులు లేనందునే..

సీసీఐ నిబంధనల ప్రకారం జిన్నింగ్ మిల్లు ఉన్నచోట మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాలో మిల్లులు లేనందున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలోని సిద్ధార్థ్ జిన్నింగ్ మిల్లు మెదక్ జిల్లాలో పండించే పత్తిని కొనేందుకు అంగీకరించింది.

 అక్కడికి వెళ్లే అవకాశం ఉన్న రైతులు వెళ్లి అమ్ముకోవచ్చు. ఇతర రైతులు సిద్దిపేట జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని విక్రయించుకోవచ్చు. రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. దీనిపై ఏఈవోలు అవగాహన కల్పిస్తున్నారు. – నాగరాజు, మార్కెటింగ్ ఏడీ