- స్లాట్ బుకింగ్ లో ఇబ్బందులు
- ఆలస్యమవుతున్న కొనుగోళ్లు
- పత్తి ఏరిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న కూలీలు
- నష్టం వచ్చినా వ్యాపారులకే అమ్ముతున్న రైతులు
మహబూబ్‌నగర్, వెలుగు: ఈ సీజన్లో పత్తి సాగు చేసిన రైతులకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది. సీసీఐ సెంటర్లను ఓపెన్ చేసినా.. ఆన్లైన్ విధానం తీసుకురావడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. పత్తి కొనుగోళ్ల కోసం స్లాట్ బుక్కింగ్‌లు చేసుకోవాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో బుక్కింగ్‌లు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు సీసీఐలో తరచూ రూల్స్ మారుతుండడంతో అక్కడ పంటను అమ్ముకోలేక రైతులు విసుగెత్తిపోతున్నారు.
పత్తి ఏరి చాలా రోజులు అవుతుండడంతో డబ్బుల కోసం కూలీలు, పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చిన ప్రైవేట్ ఫైనాన్షియర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక తక్కువ ధరకే ప్రైవేట్‌లో పంటను అమ్ముకొని నష్టపోతున్నారు.
50 రోజుల కిందటే దిగుబడులు ప్రారంభం..
వానాకాలంలో సాగు చేసిన పత్తి దిగుబడి 50 రోజుల కిందటే ప్రారంభం కాగా.. అక్టోబర్ మొదటి వారం నుంచి పత్తి ఏరడం ప్రారంభమైంది. కానీ, పత్తి ఎక్కువగా సాగు కావడంతో కూలీల కొరత ఏర్పడింది. కూలీలు అందుబాటులో లేక కూలీ రేట్లు పెంచారు. గతేడాది ఒకరికి రూ.350 కూలీ ఉండగా.. ఈ సీజన్లో రూ.500 వరకు పెరిగింది. ఆ రేటుకు రైతులు కూలీలను పెట్టి పత్తిని తీయించారు. సీసీఐ సెంటర్లలో అమ్ముకుంటే మద్దతు ధర వస్తుందని, ఆ డబ్బులో కొంత మొత్తాన్ని కూలీలకు చెల్లిస్తే సరిపోతుందని భావించారు.
కానీ, పరిస్థితులు తలకిందులయ్యాయి. యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ సెంటర్లలో పత్తి అమ్ముకోవాల్సి రావడంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. యాప్‌లో చాలా మందికి స్లాట్లు బుక్కింగ్ కాక ఇబ్బందులు ఏర్పడితే.. స్లాట్ బుక్ చేసుకున్న వారి వివరాలు ఆన్లైన్లో లేకపోవడంతో రైతులను వెనక్కి పంపిస్తున్నారు. ఇదే సమయంలో పత్తి ఏరిన డబ్బుల కోసం కూలీలు రైతుల ఇండ్లకు వస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు మాయిశ్చర్ 12 శాతంలోపు ఉన్నా.. క్వింటాల్ కు రూ.6,800 నుంచి రూ.7,100 ధర కట్టి నిండా ముంచుతున్నారు. మరికొందరు రైతులు ఆలస్యమైనా సీసీఐ సెంటర్లలో పత్తిని అమ్ముకోవాలని.. కూలీల డబ్బులు చెల్లించేందుకు ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. 3 నుంచి 5 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి కూలీలకు చెల్లిస్తున్నారు. మరోవైపు పత్తిని ఇండ్లల్లో నిల్వ చేసుకున్న రైతులు ఆందోళకు గురవుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి నల్లగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.
కండీషన్లతో స్లాట్ బుకింగ్‌లకు దూరం..
సీసీఐ సెంటర్లలో పత్తిని అమ్ముకోవడానికి ‘కపాస్ కిసాన్’ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా రైతు స్లాట్ బుక్ చేసుకుంటే, ఆ రైతు పత్తిని సీసీఐ సెంటర్లలో కొంటారు. సెంటర్లు తెరిచిన మొదట్లో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని కొనాలని కండీషన్ ఉండేది. ఆ సమయంలో సాంకేతిక సమస్యలతో స్లాట్లు రిజెక్ట్ అయ్యాయి. ఆన్లైన్లో రైతుల వివరాలు తప్పుగా నమోదు చేసినా కాన్సిల్ అయ్యేవి. అయితే గత సోమవారం నుంచి సీసీఐ ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులుగా 7 క్వింటాళ్లనే కొనాలని కండీషన్ తీసుకొచ్చింది.
ఈ కండీషన్ అమలైనప్పటి నుంచి స్లాట్ బుకింగ్‌లో ఇబ్బందులు రావడం లేదు. కానీ, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనాలనే కండీషన్‌తో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. కర్నాటక, స్థానిక వ్యాపారులకు పత్తిని అమ్ముకుంటున్నారు. మరికొందరు సీసీఐ కండీషన్‌ను మారుస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.
ప్రైవేట్‌లో అమ్ముకున్నా..
నాకున్న ఎకరా భూమితో పాటు మరో రెండు ఎకరాలకు కౌలుకు తీసుకొని పత్తి ఏసిన. సీసీఐ సెంటర్లో పత్తిని అమ్మడానికి స్లాట్‌కు బుక్ చేసిన. ఎకరాకు 12 క్వింటాళ్లు కొంటున్నట్లు స్లాట్ బుక్ అయింది. పత్తిని సెంటర్ కు తీసుకెళ్లాకఏడు క్వింటాళ్లే కొంటామని చెప్పిండ్రు. చేసేది లేక క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున ప్రైవేట్ వ్యాపారికి అమ్మిన.
–చంద్రపోళ్ల మల్లప్ప, ఊట్కూరు
ఎకరాకు 7 క్వింటాళ్లు కొంటే ఎట్ల?
నాకున్న మూడు ఎకరాల్లో పత్తి ఏసిన. 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటను అమ్ముదామంటే ఆన్లైన్లో బుకింగ్ కాలేదు. పాలమూరు సీసీఐ సెంటర్ కు పోతే ఎకరాకు ఏడు క్వింటాళ్లే తీసుకుంటామని చెబుతున్నరు. చేసేది లేక ప్రైవేట్ వ్యాపారికి పత్తిని అమ్మిన. క్వింటాల్‌కు రూ.6,750 చొప్పున చెల్లించడంతో నష్టపోయిన. - నవీన్, అమ్మాపూర్
