పరేషాన్​లో మహబూబ్​నగర్ జిల్లా పత్తి రైతులు

పరేషాన్​లో మహబూబ్​నగర్ జిల్లా పత్తి రైతులు

ఏపుగా పెరిగినా కాయ పట్టకపోవడంతో రైతుల్లో ఆందోళన 

మహబూబ్​నగర్​, వెలుగు :జిల్లాలో పత్తి రైతులు పరేషాన్​లో పడ్డారు. నిరుడు పంటకు రేట్​ బాగా వచ్చిందని ఈ ఏడాది ఎక్కువ  పంటను సాగు చేస్తే, పంట ఏపుగా పెరిగినా కాయ రావడం లేదు.  పత్తి  తీసే సీజన్​ ప్రారంభమైనా దిగుబడి లేక ఆవేదన చెందుతున్నారు.  పంటలను పరిశీలించి నష్టం అంచనా వేయాల్సిన అగ్రికల్చర్​ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.  ఈ సీజన్​లో సాగు పెరుగుతుందనే అగ్రికల్చర్​ ఆఫీసర్ల సమాచారంతో కొందరు పత్తి విత్తన వ్యాపారులు భారీ మొత్తంలో నాసిరకం విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటిని కొని పంటలు సాగు చేసిన రైతుల పొలాల్లో పంట ఏపుగా పెరిగినా, ఇంత వరకు కాయ పట్టలేదు. పది మొక్కలను పరిశీలిస్తే, అందులో నాలుగు మొక్కలకు మాత్రమే అక్కడక్కడా కాయలు పట్టాయి. ఎకరా పత్తి పంటను సాగు చేస్తే, తొమ్మిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు క్వింటాళ్ల పత్తి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా పత్తి సాగు అవుతున్న ధరూరు, కేటీదొడ్డి, మానవపాడు, అయిజ, అలంపూర్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్​, ఊట్కూరు, నర్వ, మాగనూరు, కృష్ణ, మక్తల్, మిడ్జిల్​, దేవరకద్ర, చిన్నచింతకుంట, భూత్పూర్​, రాజాపూర్​, ఆత్మకూర్, అమరచింత, మదనాపురం, పదర, బిజినేపల్లి మండలాల్లో పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోతోందని కన్నీరు పెడుతున్నారు. ఎకరా పత్తి పంట సాగుకు దాదాపు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టగా, రూ.10 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట నష్టం అంచనా వేయని ఆఫీసర్లు

వర్షాధారంగా జూన్​ చివరి వారం నుంచి జులై రెండో వారం వరకు పత్తి పంటలు వేసుకున్న రైతుల పొలాల్లో అక్టోబరు నుంచి దిగుబడులు ప్రారంభం కావాలి. ప్రస్తుతం నవంబరు రెండో వారం ప్రారంభమైనా ఉమ్మడి జిల్లాలో ఇంకా పత్తి చేతికి రాలేదు. చాలా మండలాల్లో 30 శాతం పంటలకే కాయలు పట్టాయి. అయితే, నాసిరకం విత్తనాలు వేయడం వల్లే పంటలు ఇలా తయారయ్యాయని రైతులు చెబుతున్నారు. అగ్రికల్చర్​ ఆఫీసర్లు మాత్రం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దిగుబడి రాలేదని అంటున్నారు. 

కానీ, ఇంత వరకు మొక్కలకు కాయ పట్టని చేళ్లను ఆఫీసర్లు పరిశీలించ లేదు. వ్యవసాయ శాస్ర్తవేత్తల ద్వారా పంటలను పరిశీలించి, కాయలు ఎందుకు పట్టలేదనే విషయాలను తెలుసుకునేందుకు మొక్కలకు పరీక్షలు చేయించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం సూచించిన విత్తనాలను కాకుండా నాసిరకం విత్తనాలు వాడటం వల్ల పంట ఏపుగా పెరిగినా కాయ పట్టదని, మొక్కకు పోషకాలు అందక దిగుబడి రాదనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించలేదు.  నష్టపోయిన రైతులు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నా.. వాతావరణం వల్ల పంట దెబ్బతిన్నదనే సాకులు చెబుతూ పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

నామ్​కే వాస్తేగా తనిఖీలు

ఏప్రిల్, మే, జూన్ లో  నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టేందుకు అగ్రికల్చర్​, పోలీస్​, రెవెన్యూ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​లను ఏర్పాటు చేస్తున్నా  అడ్డుకోలేపోతున్నారు. ప్రధానంగా  ఈ టీంలోని కొందరు ఆఫీసర్లకు నాసిరకం పత్తి విత్తన కంపెనీల నిర్వాహకులు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం విత్తనాలకు ఒరిజినల్​ కంపెనీల లేబుల్స్​ వేసి మార్కెట్లోకి పంపుతున్నా, చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా ఒకటి రెండు 6ఏ కేసులు నమోదు చేసి,  తిరిగి మరుసటి రోజే వదిలేస్తున్నారు. ఆ వ్యక్తులకే వేరే పేరు మీద లైసెన్స్​లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తొమ్మిది సార్లు మందు కొట్టినా.. లాభం లేదు

నాకు రెండు ఎకరాల పొలం ఉంది. పది ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం 12 ఎకరాల్లో పత్తి పెట్టిన. ఆశ, బసవ, గోల్డ్​ కార్ట్​, వింద్యా, సితార కంపెనీలకు చెందిన విత్తనాలను 45 ప్యాకెట్ల కొని చేనులో పోసిన. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు మందులు కొట్టిన. ఇంత వరకు పంటకు కాయలు పట్టలేదు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినా. పంట మొత్తం లాస్​ అయ్యింది. 

‌‌‌‌‌‌‌‌ - ఎక్కచేను మల్లేశం, రైతు
వంకేశ్వరం, నాగర్​కర్నూల్​ జిల్లా

పది మొక్కల్లో ఎనిమిది గొడ్డుపోయినయి..

నాకు 20 ఎకరాల పొలం ఉంది.  ఏటా నేను పత్తి వేస్తా. అందులో 17 ఎకరాల్లో ఈసారి పత్తి వేసిన. ఇంత వరకు ఎప్పుడూ ఇట్ల కాలే. కానీ, ఈసారి పది మొక్కలకు రెండు మొక్కలకే కాయలు పట్టినవి. మిగతా ఎనిమిది మొక్కలకు గొడ్డుపోయినవి. గూడ లేదు,  కాయ లేదు. లక్షల్లో పెట్టుబడి పెట్టినం. మా కుటుంబాల పరిస్థితి ఏంటి. ఎకరా పొలంలో కనీసం క్వింటాల్ పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు.

- ఆరుట్ల పెంటయ్య, వంకేశ్వరం,