దేశానికి స్టూడెంట్లే టార్చ్‌‌ బేరర్లు.. గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

దేశానికి స్టూడెంట్లే టార్చ్‌‌ బేరర్లు.. గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ
  • ఘనంగా పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం

మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : దేశానికి భవిష్యత్‌‌లో స్టూడెంట్లే టార్చ్‌‌ బేరర్లు అని గవర్నర్‌‌ జిష్ణు దేవ్‌‌ వర్మ అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో గురువారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో పొందిన జ్ఞానంతో ఎంచుకున్న రంగాల్లో రాణించాలని సూచించారు. యూనివర్సిటీలు ఆధునిక దేవాలయాలు అని చెప్పారు. పాలమూరు వర్సిటీని స్థాపించిన ఒకటిన్నర దశాబ్దంలోనే విద్యా, మౌలిక వసతుల కల్పనలో మెరుగైన పురోగతి సాధించడం గర్వకారణమన్నారు. 

వర్సిటీలో చేపట్టిన కమ్యూనిటీ ఔట్‌‌ రీచ్‌‌, మిలియన్‌‌ ట్రీ ప్లాంటేషన్‌‌, గ్రామాల దత్తత వంటి కార్యక్రమాలు బాగున్నాయన్నారు. తెలంగాణలో సుమారు పది వర్సిటీలు ఉన్నప్పటికీ... పీఎం ఉష స్కీం కింద ఒక్క పాలమూరు వర్సిటీకే రూ.100 కోట్లు మంజూరవడం అభినందించదగ్గ విషయమన్నారు. ‘ఏక్ పేడ్.. మా కే నామ్’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 12 మందికి డాక్టరేట్లతో పాటు 83 మందికి గోల్డ్‌‌ మెడల్స్‌‌ అందజేశారు.

 అలాగే యూనివర్సిటీ నుంచి మొదటిసారిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్‌‌ఎన్‌‌ ఫార్మా కంపెనీల అధినేత అయిన మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా నవాబుపేట మండలానికి చెందిన మన్నె సత్యనారాయణ రెడ్డికి గౌరవ డాక్టరేట్‌‌ అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ జీఎన్‌‌ శ్రీనివాస్‌‌, జోగులాంబ జోన్‌‌ ఐజీ ఎల్‌‌ఎస్‌‌ చౌహాన్‌‌, కలెక్టర్‌‌ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి, మహబూబ్‌‌నగర్‌‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సర్కార్‌‌ పథకాలు చివరి లబ్ధిదారు వరకు అందాలె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు చివరి లబ్ధిదారుడి వరకు అందేలా చూడాలని గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ ఆఫీసర్లను ఆదేశించారు. పీయూ స్నాతకోత్సవం అనంతరం సాయంత్రం కలెక్టరేట్‌‌లో ఎంపీ డీకే.అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌ డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌‌రెడ్డి, కలెక్టర్‌‌ విజయేందిక బోయితో కలిసి ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 1,441 మంది చెంచుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా చెంచులకు స్వయం ఉపాధి, సౌర విద్యుత్‌‌, పక్కా ఇండ్లు, విద్య అందేలా చూడాలన్నారు. చెంచులు, ఆదివాసీ మహిళలను స్వయంసహాయక సంఘాల్లో చేర్చుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాడాలని సూచించారు. 

అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్టూడెంట్లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం గ్రామీణాభివృద్ధి, వైద్యం, మెప్మా, రెడ్ క్రాస్, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌‌ను పరిశీలించారు. ‘పీఎం జన్‌‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్’ కింద ఏర్పాటు చేసిన మొబైల్‌‌ హెల్త్‌‌ వెహికల్‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.