పత్తి రైతులను ముంచుతున్న దళారులు .. ఏజెన్సీలో రైతుల అమాయకత్వమే ఆసరాగా మోసం

పత్తి రైతులను ముంచుతున్న దళారులు .. ఏజెన్సీలో రైతుల అమాయకత్వమే ఆసరాగా మోసం
  • క్వింటాలుకు రూ.500 నష్టపొతున్న రైతులు
  • పట్టించుకోని వ్యవసాయ, మార్కెటింగ్​శాఖ అధికారులు

ఆసిఫాబాద్, వెలుగు:  పత్తి రైతులను దళారులు నిండా ముంచుతున్నారు. అప్పులే పెట్టుబడిగా పెడితే ఆశించిన దిగుబడి రాక పరేషాన్ అవుతున్న రైతన్నలకు మద్దతు ధర దొరకడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకుండా ఏదో ఓ సాకు చూపుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, తేమ పేరుతో తిరస్కరించడం, లేదా డబ్బులు అత్యవసరమై రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకొని వ్యాపారులు గవర్నమెంట్ మద్దతు ధర రూ.7020 కాకుండా.. రూ. 6500 నుంచి 6700 కు కొనుగోలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. 

రూ.6500 నుంచి 6700 మాత్రమే చెల్లిస్తూ..

ఆసిఫాబాద్ జిల్లాలో 3,15,443 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. అయితే, రైతుల ఆర్థిక అవసరాలు, నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ప్రైవేటు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే డబ్బులు తొందరగా రావనే ఉద్దేశ్యంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు అమ్ముతుండగా వారికి తక్కువ ధర చెల్లిస్తూ నిలువునా ముంచుతున్నారు. రూ.6500 నుంచి 6700 మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు క్వింటాలుకు దాదాపు రూ.500 నష్టపోతున్నారు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, కౌటాల, బెజ్జుర్, చింతలమనేపల్లి, పెంచికల్ పేట్, దహెగాం, వాంకిడి, కెరమెరి, రెబ్బెన తదితర మండలాల్లో పత్తి  దళారుల దందా జోరుగా కోనసాగుతుంది. క్షేత్రస్థాయిలో డ్యూటీ చేస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించకపోవడం, సమాచారం ఇవ్వకపోవడంతో చాలా మంది రైతులు సీసీఐ కేంద్రాలకు వెళ్లకుండా ప్రైవేటుకే అమ్మి నష్టపోతున్నారు.  ఈ విషయంపై రైతు సంఘాల నాయకులుపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతులు సంఘం లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కెరమెరి లో జోరుగా జీరో దందా...

కెరమెరి మండల కేంద్రంలో సీసీఐ కోనుగోలు సెంటర్ ఏర్పాటు చేయకపోవడం దళారులకు కలిసొచ్చింది. ఇదే అదునుగా ఏజెన్సీ గ్రామాల్లో జీరో వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. సీసీఐ ధరకు తగ్గించి క్వింటాలుకు రూ.500 నుంచి 700 తేడాతో కొంటున్నారు. తేమ పేరిట, హమాలి, సంచి బరువు ఇలా పలు కారణాలు చూపుతూ అమాయక రైతులను మోసం చేస్తున్నారు. తూకంలోనూ మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. కెరమెరి మండల కేంద్రంతో పాటు ధనోర, సుర్దాపూర్, సావర్ ఖేడా, సాంగ్వి, కెలికే, తెలంగాణ–మహరాష్ట్ర వివాదస్పద గ్రామాల్లో దళారుల దర్జాగా తక్కువ ధరకు కొనుగోలుచేస్తున్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు తక్కువ ధరకు కొంటే చర్యలు తీసుకుంటాం. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి గవర్నమెంట్ కల్పించిన మద్దతు ధర పొందాలి.

 గజానంద్, జిల్లా మార్కెటింగ్ ఆఫిసర్

 సీసీఐలో కొనాలె

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయకపోవడంతో నష్టపోతున్నం. గత్యంతరం లేక ప్రైవేట్ లో తక్కువ ధరకు అమ్మి నష్టపోతున్నం. నేను ఆరెకరాలు కౌలుచేసి పత్తి వేసిన. పైసలు అక్కెరపడి పత్తి అమ్మితే ఊర్లో రూ.6500 పెడుతున్నారు. గత్యంతరం లేక అగ్గువకే 20క్వింటాళ్లు అమ్మిన. సీసీఐలో పత్తి కొనాలె.

చప్పిడి రమేశ్, రైతు, దహెగాం

సీసీఐ లేక ప్రైవేటుకు అమ్ముకుంటున్నం

సీసీఐ మార్కెట్ లేక ప్రైవేట్ కు అమ్ముకుంటున్నం. 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని మార్కెట్​కు పోవాలంటే వెహికల్ చార్జెస్ ఎక్కువైతున్నయ్. దగ్గర్లో సీసీఐ మార్కెట్ ఏర్పాటు చేయాలి.

 పెందోర్ యాదవ్ రావు, రైతు, ఇర్కాపల్లి, తిర్యాణి