రాష్ట్రంలో వచ్చే వారం నుంచే పత్తి కొనుగోళ్లు!

రాష్ట్రంలో వచ్చే వారం నుంచే పత్తి కొనుగోళ్లు!
  • తుమ్మల చొరవతో తొలగిన ప్రతిష్టంభన.. రైతులకు ఊరట
  • సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లు, అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం
  • నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలపై సుదీర్ఘ చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే వారం రైతుల నుంచి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభిస్తామని సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లు తెలిపారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు చొరవతో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. సోమవారం ఆయన సెక్రటేరియెట్​లో సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లు, అగ్రికల్చర్​, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన సూచనలతో సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లు ఏకీభవించారు. దీంతో కొనుగోళ్ల కోసం అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.

ఎవరూ నష్టపోకుండా చర్యలు

సీసీఐ టెండర్ నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై  సమావేశంలో మంత్రి తుమ్మల విస్తృతంగా చర్చించారు. సీసీఐ కొత్తగా అమలు చేసిన నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లకు ఇబ్బందులు ఎదురైతే, వాటిని పరిష్కరించేందుకు ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని సీసీఐ అధికారులకు మంత్రి సూచించారు. లింట్ శాతం, ఎల్​1, ఎల్​2 అలాట్‌‌మెంట్, స్లాట్ బుకింగ్, ఏరియా మ్యాపింగ్‌‌కు సంబంధించిన నిబంధనలపై వారితో మాట్లాడారు. 

ఇతర రాష్ట్రాల్లో తరహాలో రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు వెంటనే టెండర్లలో పాల్గొని, జాప్యం లేకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని వారికి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సీసీఐ, జిన్నింగ్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిన్నింగ్ మిల్లర్లు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిన్నింగ్ పరిశ్రమకు సంబంధించిన కొత్త మార్గదర్శకాల విషయంలో సమస్యలు తలెత్తితే, స్వతంత్ర ఏజెన్సీ ద్వారా వాటిని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు అవగాహన కల్పించండి

కిసాన్ కపాస్ మొబైల్ యాప్, స్లాట్ బుకింగ్ యాప్‌‌, టోల్​ఫ్రీ నంబర్​పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించగా, ఇప్పటికే మండలాల వారీగా రైతు వేదికల ద్వారా ఈ యాప్‌‌లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సీసీఐతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. మంత్రి చొరవతో పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యలు తొలగి, రైతులకు ఊరట కలిగించే దిశగా కీలక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.