సదాశివపేట: ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను దొంగలు రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామ శివారులో చోటుచేసుకుంది. చేతికొచ్చిన పంట దొంగలపాలు కావడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు.
మద్దికుంట గ్రామానికి చెందిన బ్రహ్మానందరెడ్డి తనకున్న ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సరిగా లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో పంటలు ఆశించిన స్థాయిలో పండలేదు. అయితే తన పొలంలో పత్తి పంట సమృద్ధిగా పండటంతో రైతు ఎంతో సంతోషించాడు.
దసరా పండుగ రోజున పత్తి పంటకు ప్రత్యేక పూజలు చేసి, మరికొద్ది రోజుల్లో పత్తి తీయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలోనే గుర్తుతెలియని దొంగలు నాలుగు ఎకరాల పత్తి చేనులో పడి రాత్రికి రాత్రే సుమారు 10 క్వింటాళ్ల పత్తిని దొంగిలించారు. దీంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గత సంవత్సరం అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయామని, ఈ ఏడాది పంట బాగా పండటంతో సంతోషంగా ఉన్న సమయంలో దొంగల బారిన పడాల్సి వచ్చిందని బ్రహ్మానందరెడ్డి కన్నీటిపర్యంతమయ్యాడు.
ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు సుమారు రూ.10 వేల వరకు ఉందని, దొంగిలించిన 10 క్వింటాళ్ల పత్తి విలువ దాదాపు రూ.లక్ష ఉంటుందని తెలిపారు. కష్టపడి పండించిన పంటను కళ్లముందే కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రైతు కష్టాన్ని దోచుకున్న దొంగలను గుర్తించి, పత్తిని తిరిగి స్వాధీనం చేసుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
