ఇవాళ ఓట్ల లెక్కింపు..రేపు ఫలితాలు

V6 Velugu Posted on Mar 17, 2021

  • ఇవాళ ఓటింగ్ ట్రెండ్‌ తెలిసే అవకాశం
  • గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఫలితం తేలడానికి రెండ్రోజులు పట్టే చాన్స్
  • చెల్లుబాటైన ఓట్లలో ఒకరికి 50 శాతం ఓట్లు వచ్చే వరకు కౌంటింగ్‌
  • ఫస్ట్‌ ప్రయారిటీ ఓట్లతో రిజల్ట్‌ తేలకుంటే రౌండ్ల వారీగా లెక్కింపు
  • రాత్రి 8 గంటల కల్లా తొలి ప్రాధాన్యత ఓట్లపై స్పష్టత
  • 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు కలిపి 1,760 మంది కౌంటింగ్ స్టాఫ్
  • ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో 8 హాళ్లు, 56 టేబుల్స్‌
  • 25 బ్యాలెట్లకో కట్ట.. టేబుల్‌కు వెయ్యి ఓట్లు.. ఒకేసారి 56 వేల ఓట్ల లెక్కింపు
  • వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి పోలైన ఓట్లు: 3,86,320
  • ‘హైదరాబాద్, రంగారెడ్డి,  మహబూబ్నగర్ స్థానానికి పోలైన ఓట్లు: 3,57,354

హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్‌ తేలేందుకు రెండ్రోజుల టైమ్‌ పట్టనుంది. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50 శాతం ప్లస్‌ వన్‌ ఓటు వచ్చిన వారినే గెలిచినట్లు ప్రకటించాల్సి ఉండటంతో ఆ ఓట్లు వచ్చే వరకు రౌండ్ల వారీగా కౌంటింగ్‌ జరుగుతూ పోతుంది. తక్కువ ఓట్లు వచ్చిన క్యాండిడేట్లను ఎలిమినేట్‌ చేస్తూ వాళ్ల ప్రాధాన్యత ఓట్లను మిగిలిన క్యాండిడేట్లకు కలుపుతూ 50 శాతం ఓట్లు వచ్చే వరకు కౌంటింగ్‌ సాగుతుంటుంది. రాత్రి 8 గంటల వరకు మొదటి ప్రాధాన్య ఓట్లపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. గెలుపుకు ఎవరు దగ్గరున్నారో రెండో రోజు ఉదయానికి తేలొచ్చని అంచనా వేస్తున్నారు. 

క్యాండిడేట్లు, ఓట్లు పెరిగినయ్

ఈసారి వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి 71 మంది క్యాండిడేట్లు పోటీ చేశారు. ఇక్కడ 5,05,565 ఓట్లకు 3,86,320 ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్స్థానానికి 93 మంది పోటీపడ్డారు. ఇక్కడ 5,31,268 ఓట్లకు 3,57,354 ఓట్లు పడ్డాయి. సాధారణంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్‌‌కు చాలా టైమ్‌‌ పడుతుంది. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఎన్నిక రిజల్ట్‌‌ ప్రకటించేందుకు36 గంటలు పట్టింది. ఇప్పుడు రెండు స్థానాల్లోనూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటం, ఎక్కువ సంఖ్యలో ఓట్లు పడటం, పెద్ద బ్యాలెట్పేపర్ కావడంతో రెండ్రోజులైనా పడుతుందని సీఈవో శశాంక్ గోయల్ చెప్పారు. న్యూస్ పేపరంత సైజులో మడిచి ఉన్న బ్యాలెట్పేపర్‌‌ను విప్పడం, దాంట్లో చెల్లని ఓట్లను గుర్తించడం, ఆ తరువాత ప్రాధాన్యత ఓట్లను గుర్తించడం, ఎలిమినేషన్ చేసేందుకు చాలా టైం పడ్తుందని అన్నారు.

షిఫ్టుల వారీగా డ్యూటీలు

రెండు స్థానాల ఓట్ల లెక్కింపునకు రెండు కేంద్రాల్లో 8 హాళ్లు, 56 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. రెండింటికీ కలిపి 1,760 మంది కౌంటింగ్స్టాఫ్‌ను నియమించారు. వీరికి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది. షిప్టుల వారీగా డ్యూటీలు వేశారు. కౌంటింగ్ ప్రక్రియ రేయింబవళ్లు కొనసాగనుంది. 19వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్‌‌ పూర్తయ్యే వరకు సిబ్బందికి  కనీస వసతులు అక్కడే ఏర్పాటు చేశారు. ఉదయం 6 .30 గంటల వరకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ హాల్‌‌కు చేరు కోవాలి. బ్యాలెట్ బాక్సులను ముందుగా ఏజెంట్లతో పరిశీలన చేయించి వారి సంతకం తీసుకున్న తర్వాత తెరుస్తారు. కౌంటింగ్ హాల్ లోకి వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు సెల్ ఫోన్లు, పెన్ను, పుస్తాకాలు తీసుకురాకూడదు. ఎన్నికల అధికారులే పెన్సిల్, నోట్‌‌బుక్ అందిస్తారు.

బ్యాలెట్‌‌ పేపర్లను కట్టలు కట్టేందుకే మస్తు టైమ్‌‌

ఒక్కో టేబుల్‌‌పై బ్యాలెట్‌‌ పత్రాలను పెట్టాక 25 బ్యాలెట్‌‌ పేపర్లకో కట్ట కడతారు. ప్రస్తుతం పోలైన ఓట్ల ప్రకారం బ్యాలెట్లను 25 చొప్పున కట్టలు కట్టడానికే ఎక్కువ టైమ్‌‌ పట్టనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు స్టార్టయితే సాయంత్రం వరకు బ్యాలెట్‌‌ పేపర్లను కట్ట కట్టే ప్రక్రియ సాగొచ్చని అధికారులు అంటున్నారు. తరువాత కట్ట కట్టిన బ్యాలెట్‌‌ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్‌‌, సహాయ రిటర్నింగ్‌‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్‌‌ ఏజెంట్ల సమక్షంలో వేరు చేస్తారు. ఆ తర్వాత మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఇలా 56 టేబుళ్లపైన ఏకకాలంలో ప్రక్రియ సాగుతుంది. టేబుల్‌‌కు వెయ్యి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారు. దీనికి సుమారు గంటన్నర పడుతుందని అంచనా వేశారు. కాబట్టి రాత్రి 7, 8 గంటలకు తొలి ప్రాధాన్యత ఓట్ల రిజల్ట్ ట్రెండ్తెలిసే అవకాశం ఉంది. రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోనూ మూడున్నర లక్షల పైన ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించడానికి 6 రౌండ్లకు 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుందని అంచనా. దీని ప్రకారం రెండో రోజు ఉదయానికి కానీ ఎవరు గెలుపునకు దగ్గర్లో ఉన్నారనేది తేలదు.

పొద్దున 8 గంటలకు స్టార్ట్‌‌

వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి సంబంధించి ఓట్ల లెక్కింపుకు నల్గొండలోని ఆర్జాలబావి సమీపంలోని స్టేట్ వేర్హౌజింగ్ గోదాంలో.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానానికి సరూర్‌‌నగర్‌‌ ఇండోర్‌‌ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. బుధవారం పొద్దున 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. బ్యాలెట్ ఎన్నికలు కాబట్టి కట్టలు కట్టడం, చెల్లని ఓట్లను తొలగించడం, విజేతకు రావాల్సిన కోటాను నిర్ణయించటం, ఆ తర్వాతే అసలు లెక్కింపు మొదలవుతుంది. ఈ లెక్కన ట్రెండ్ తెలవాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. తొలి ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేందుకు అర్ధరాత్రి వరకు పట్టే అవకాశముంది. జనరల్ ఎలక్షన్స్‌‌లో ఎంతమంది పోటీలో ఉన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను గెలిచినట్లు ప్రకటిస్తారు. ఓడిపోయిన వాళ్ల ఓట్లతో పని ఉండదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50 శాతం ప్లస్ ఒక ఓటు ఎక్కువగా వచ్చిన వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. అలా రాకపోతే రౌండ్‌‌ల వారీగా తక్కువ ఓట్లు వచ్చిన క్యాండిడేట్లను ఎలిమినేట్‌‌ చేస్తూ వారి ప్రాధాన్యత ఓట్లను మిగిలిన క్యాండిడేట్లకు కలుపుతూ పోతారు.

 

Tagged Telangana, TS, Today, mlc, Tomorrow, counting, Votes, results

Latest Videos

Subscribe Now

More News