రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్ : రాష్ట్రంలో డిసెంబర్ 10న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. 
కౌంటింగ్ కోసం ఆదిలాబాద్ లో 6, నల్గొండలో 5, మెదక్ లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్ లో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లను మొదట 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కించనున్నారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతించనున్నారు. ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.