ఎమ్మెల్సీ బైపోల్​ కౌంటింగ్​ ​వాయిదా

ఎమ్మెల్సీ బైపోల్​ కౌంటింగ్​ ​వాయిదా
  • జూన్ 2న చేపట్టాలని ఈసీ ఆదేశాలు
  • లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్‌ 2వ తేదీకి పోస్ట్​పోన్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 5వ తేదీ నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 16న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.

దీంతో అదేరోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

దీంతో ఆయన తన  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. మహబూబ్​నగర్ బాలుర జూనియర్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లో బ్యాలెట్ బాక్సులు అధికారులు భద్రపర్చారు. ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం ఓట్లు లెక్కించాలి. కానీ.. ఎమ్మెల్సీ బై ఎలక్షన్ రిజల్ట్స్ వెల్లడిస్తే.. అది పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్​ను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

అభ్యర్థుల్లో నిరాశ

ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రిజల్ట్ వాయిదా పడడంతో అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ఈ ఉప ఎన్నికలను అధికార కాగ్రెస్​తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఈ ఉపఎన్నిక జరుగుతుండటంతో ఎలాగైన పట్టు సాధించేందుకు రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. పోటీలో ముగ్గురు క్యాండిడేట్లు బరిలో ఉండగా.. కాంగ్రెస్​ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి మధ్యనే నువ్వానేనా అన్నట్లు ఫైట్ నడిచింది.

నామినేషన్​ల ఉపసంహరణ ముగిసిన మరుసటి రోజు నుంచే రెండు పార్టీల క్యాండిడేట్లు ఎన్నికల ప్రచారం కన్నా.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే ప్రయారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే సమాచారంతో అభ్యర్థులు తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించారు. ఓటర్లను క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించారు. అయితే ఈసీ నిర్ణయంతో కౌంటింగ్ రెండు నెలలు వాయిదా పడింది.