
- ఓఎంఆర్ షీట్ల లెక్క తప్పుతున్నది!
- గ్రూప్ 1లో 258, గ్రూప్ 4లో 963 పెరిగినయ్
- టెట్ పేపర్1 లో 3వేలకు పైగా తగ్గగా, పేపర్ 2లో 84 ఎక్కువొచ్చినయ్
- ప్రైమరీ, ఫైనల్ రిపోర్టులకు తేడాలు ఉంటాయంటున్న ఆఫీసర్లు
- అవకతవకలు జరిగాయని అభ్యర్థుల్లో అనుమానాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు పోటీ పరీక్షలపై అభ్యర్థుల్లో అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఓఎంఆర్ షీట్లలో మార్పులే దీనికి ప్రధాన కారణం. గ్రూప్ 1తో పాటు గ్రూప్ 4 ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లు పెరిగాయి. ఇక టెట్ ఎగ్జామ్ పేపర్ 1లో తగ్గగా, పేపర్ 2లో పెరిగాయి. అయితే, ఓఎంఆర్ లెక్కల్లో అధికారులు ఇచ్చే నిర్లక్ష్యపు సమాధానాలతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఆయా పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ విషయంలో బయోమెట్రిక్ పెట్టకపోవడం, ఓఎంఆర్ షీట్లపై వివరాల్లేకపోవడంతో పాటు ముందుగా ప్రకటించిన ఓఎంఆర్ షీట్లకు, స్కాన్ చేసిన తర్వాత ప్రకటించిన ఓఎంఆర్ షీట్లకు పొంతన ఉండకపోవడంతో అందరిలో అనుమానాలు ఎక్కువయ్యాయి. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ను రద్దు చేసింది.
కాగా, జూన్ 11న గ్రూప్1 ఎగ్జామ్ జరగ్గా ఆ రోజు సాయంత్రం 2,33,248 మంది పరీక్ష రాసినట్టు టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత నెల రోజులకు 2,33,506 మంది ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో పెట్టినట్టు వెల్లడించారు. అయితే, కలెక్టరేట్ ఆఫీసుల నుంచి తీసుకున్న సమాచారంతోనే ముందుగా ప్రైమరీ వివరాలు పెట్టామని, ఆ తర్వాత ఓఎంఆర్ షీట్లు లెక్కిస్తే 258 ఎక్కువ వచ్చాయని టీఎస్ పీఎస్సీ అధికారులు అంటున్నారు. ఈ వివరణ కూడా ఎగ్జామ్ రద్దయిన తర్వాత ఇవ్వడం గమనార్హం.
టెట్ లోనూ అంతే..
టెట్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లలోనూ గందరగోళం నెలకొంది. టెట్ ఎగ్జామ్కు సంబంధించి మొదట ప్రకటించిన వివరాలకు, రిజల్ట్ టైమ్లో చెప్పిన లెక్కలకు భారీగా తేడాలు ఉన్నాయి. పోయిన నెల 15న టెట్ ఎగ్జామ్ జరిగింది. పేపర్1 ఎగ్జామ్కు 2,26,744 మంది, పేపర్ 2కు 1,89,963 మంది హాజరయ్యారని ఎస్సీఈఆర్టీ అధికారులు అదే రోజు ప్రకటించారు. తర్వాత ఇటీవల ప్రకటించిన రిజల్ట్ టైమ్లో మాత్రం పేపర్1లో 2,23,582 మంది, పేపర్ 2లో 1,90,047 వివరాలను మాత్రమే వెల్లడించారు. ఈ లెక్కన పేపర్ 1లో 3,162 ఓఎంఆర్ షీట్లు తగ్గగా, పేపర్ 2లో 84 ఓఎంఆర్ షీట్లు పెరిగాయి. దీనిపై ఇప్పటికీ అటు ఎస్సీఈఆర్టీ అధికారులు గానీ, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
గ్రూప్ 4లోనూ గందరగోళం..
గ్రూప్ 4లో కూడా ఓఎంఆర్ షీట్ల గందరగోళం ఏర్పడింది. జులై 1న గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. 7,62,872 మంది పేపర్ 1 రాశారు. 7,61,198 మంది పేపర్ 2 రాశారు. తర్వాత వెబ్సైట్లో ఓఎంఆర్ స్కానింగ్ కాపీలు పెట్టే టైమ్లో మాత్రం ఈ సంఖ్య మారిపోయింది. పేపర్ 1లో 7,63,835 మందివి, పేపర్ 2లో 7,61,026 మంది ఓఎంఆర్ షీట్లు వెబ్సైట్లో పెట్టారు. దీంతో పేపర్ 1లో 963 ఓఎంఆర్ షీట్లు పెరిగాయి. పేపర్ 2లో 172 ఓఎంఆర్ షీట్లు తగ్గాయి. జిల్లాల నుంచి వివరాలు ఇచ్చే వారంతా అంతా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారనే దానిపై టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత కరువైంది.