రైల్వే ఉద్యోగం పేరుతో రూ.2.6 కోట్ల ఘరానా మోసం

రైల్వే ఉద్యోగం పేరుతో రూ.2.6 కోట్ల ఘరానా మోసం

రైల్వే ఉద్యోగం అంటే ఎవరికి మాత్రం ఆశ, ఇష్టం ఉండదు..? అలానే అనుకున్నారనేమో.. ! ఈజీగా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు. చివరికు మోసపోయి రోడ్డున పడ్డారు. రైల్వేలో ఉద్యోగానికి ముందు శిక్షణ తీసుకోవాలి. ఆ తర్వాత జాబ్ గ్యారెంటీ అంటూ ఓ ముఠా నిరుద్యోగులకు గాలం విసిరింది. ఇంతకీ ఆ శిక్షణ ఏంటనుకున్నారా..? స్టేషన్ కు రైళ్లు ఎన్ని వస్తున్నాయి..? ఎన్ని వెళ్తున్నాయి..? వాటికి ఎన్ని బోగీలు ఉన్నాయో లెక్కించాలట..! శిక్షణ పేరుతో అలా ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా 28 మందిని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో బోగీలు లెక్కించేందుకు కూర్చోబెట్టారు. అంతేకాదు వారి నుంచి దాదాపు రూ. 2.67 కోట్లు వసూలు చేశారు. తీరా మోసపోయామని తెలిసి బాధితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 

తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి అనే వ్యక్తి ఆర్మీలో పని చేసి రిటైర్‌ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో కోయంబత్తూరుకు చెందిన శివరామన్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి, ముగ్గురు యువకులను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ విషయం మధురైలోని చాలా మందికి తెలిసి మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. వీరిని తీసుకుని కూడా ఆయన ఢిల్లీకి వెళ్లారు. వీరందరిని  వికాస్‌ రాణా అనే వ్యక్తికి పరిచయం చేయగా.. తాను ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నానంటూ వారిని మాయమాటలతో నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్‌ అసిస్టెంట్, క్లర్క్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో బాధితుడి నుంచి రూ.24 లక్షల వరకు వసూలు చేసి, ఫోర్జరీ సంతకాలతో వారి ఐడీ కార్డులు, ట్రైనింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చాడు.

28 మందికి నెల రోజుల పాటు ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో శిక్షణ కూడా ఇప్పించాడు. రోజుకు 8 గంటల పాటు స్టేషన్‌కు వచ్చేపోయే రైళ్లను, వాటి బోగీలను లెక్కించాలని, ఆ ఉద్యోగాలకు ఇదే శిక్షణ అంటూ వారిని నమ్మించాడు. ఈ ఏడాది జూన్‌ -జులైలో నెల రోజుల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వాటిని పట్టుకుని రైల్వే అధికారుల వద్దకు వెళితే.. అవి ఫోర్జరీ పత్రాలని తేలింది. దీంతో తామంతా మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న 28 మంది బాధితులు సుబ్బుసామిని ఆశ్రయించగా... ఢిల్లీ ఆర్థిక నేర విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.