మళ్లీ ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బుగులు

మళ్లీ ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బుగులు
  • ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆందోళన
  • అనేక దేశాల ఆంక్షలు.. అయినా పాకుతున్న వైరస్ 
  • పలు యూరోప్ దేశాల్లో ఒమిక్రాన్ అలజడి

ద హేగ్: ఆఫ్రికన్ దేశాల్లో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్నది. ఒమిక్రాన్ వేరియంట్ (బీ.1.1.529) శరవేగంగా వ్యాపిస్తోందన్న వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. దాంతో ఆయా దేశాలపై అనేక దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. అమెరికా, ఇంగ్లండ్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇరాన్, థాయ్ లాండ్ వంటి దేశాలు ఆఫ్రికా దేశాలపై ఆంక్షలను పెంచేశాయి. అయితే విమాన రాకపోకల వంటివాటిపై పూర్తి నిషేధం పెట్టినా కొత్త వేరియంట్ పలు యూరప్, ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న సూచనలే కన్పిస్తున్నాయి. బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్, జర్మనీ వంటి పలు దేశాల్లో ఈ  కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా రిపోర్టయ్యాయి.

డేంజరస్ కేటగిరీలో చేర్చిన డబ్ల్యూహెచ్‌వో

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తో ఇన్ఫెక్షన్ ముప్పు చాలా ఎక్కువ. పైగా భారీ మ్యుటేషన్లతో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లకు సవాలుగా మారుతోంది. దాంతో దీన్ని డేంజరస్ కేటగిరీలో డబ్ల్యూహెచ్ వో చేర్చింది. కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు కొత్త వేరియంట్ తో చాలా ముప్పంటున్నారు. కాకపోతే ఇది ఎంత ప్రమాదకరమో, వ్యాక్సిన్లు దీన్ని ఏ మేరకు అడ్డుకోగలవో స్పష్టత రావాలంటే కొన్ని వారాలైనా పడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఒమిక్రాన్ శరవేగంగా స్ప్రెడ్ అవుతున్నట్టు కన్పిస్తోందని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. అమెరికాలో గురువారం థాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొత్త వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో దక్షిణ ఆఫ్రికా నుంచి ట్రావెలర్ల ఎంట్రీపై ఆంక్షలు విధిస్తున్నట్టు బైడెన్ శుక్రవారం ప్రకటించారు. వేడుకల కంటే ముందు జాగ్రత్తలే తమకు ముఖ్యమన్నారు. సౌతాఫ్రికా నుంచి జర్మనీకి తిరిగొచ్చిన ఒక ట్రావెలర్ లో ఒమిక్రాన్ తరహా మ్యుటేషన్స్ కన్పించడంతో అక్కడా ఆందోళన మొదలైంది. ప్రస్తుత వ్యాక్సిన్లు దీన్ని సమర్థంగానే ఎదుర్కొంటాయని ఫార్మా కంపెనీలంటున్నాయి. ఆఫ్రికాలో ఇప్పటికీ 6 శాత మంది మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. హెల్త్ వర్కర్లు కూడా  వ్యాక్సిన్లు వేసుకోకుండానే ప్రమాదకరక పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తున్నది. ఇవన్నీ భయానక పరిస్థితులకు దారి తీయొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

చెక్ రిపబ్లిక్, జర్మనీకి వ్యాప్తి.. 

చెక్‌‌ రిపబ్లిక్‌‌లో ఒమిక్రాన్ అనుమానిత కేసు రికార్డయినట్టు తెలిసిందని అక్కడి వార్తా సంస్థ చెప్పింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నామని జర్మన్‌‌ తెలిపింది. బ్రిటన్​లో 2 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఆంక్షలు కఠినం చేశారు. కొత్త వేరియంట్ కేసు రికార్డైన 8 ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రయాణికులు రాకుండా థాయ్‌‌లాండ్ బ్యాన్ చేసింది. అలాగే  సౌత్‌‌ ఆఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌‌కు రెండు విమానాల్లో 600 మంది ప్రయాణికులు రాగా, వారిలో 61 మందికి పాజిటివ్‌‌గా తేలింది. అయితే వాళ్లకు సోకింది ఒమిక్రానా.. కాదా.. అన్నది తేలాల్సి ఉంది.