
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లోకి గురువారం దంపతులు బర్లను తోలి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. బాధితులు తెలిపిన ప్రకారం.. భూపాలపల్లి టౌన్ మంజూరు నగర్ కి చెందిన కూరాకుల ఓదెలు, లలిేేేత దంపతులు పశుపోషణ చేస్తూ జీవిస్తున్నారు. స్థానికంగా ఉన్న వారి స్థలంలో ఇల్లు కట్టుకొని, బర్ల కోసం షెడ్డు వేశారు. వీరి ఇంటికి కొద్ది దూరంలో సింగరేణి స్థలం ఉంది. అక్కడి వరకు సీసీ రోడ్డు వేయాలంటే బర్ల కొట్టం అడ్డంగా ఉంది. అది ప్రభుత్వ స్థలంలో ఉందని ఓదెలు కుటుంబానికి నోటీసులు ఇచ్చి.. గురువారం పోలీసుల సహకారంతో మున్సిపల్ ఆఫీసర్లు షెడ్డును కూల్చేశారు. ఎందుకు కూల్చారని బాధితులు అడిగితే.. ఆఫీసర్లు ఎమ్మెల్యే పేరు చెప్పడంతో కోపంతో ఓదెలు దంపతులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి తమ బర్లను తోలుకుని వెళ్లి నిరసన తెలిపారు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి చస్తామని మందు డబ్బాతో హెచ్చరించారు. పోలీసులు అడ్డుకుని ఓదెలు దంపతులను పీఎస్కు తరలించారు.
నాకు తెల్వకుండా చేశారు: ఎమ్మెల్యే గండ్ర
మున్సిపల్ ఆఫీసర్లు బర్ల కొట్టాన్ని కూల్చివేసినది తనకు తెలియదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. షెడ్డును కూల్చివేయమని ఎవరికీ చెప్పలేదని, బాధ్యులైన ఆఫీసర్లపై చర్యలు తీసుకుని, ఓదెలు కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు.