Sreedevi: 'కోర్ట్' బ్యూటీ శ్రీదేవి తమిళ ఎంట్రీ.. 'హైకూ' ఫస్ట్‌లుక్ రిలీజ్!

Sreedevi: 'కోర్ట్' బ్యూటీ శ్రీదేవి తమిళ ఎంట్రీ.. 'హైకూ' ఫస్ట్‌లుక్ రిలీజ్!

'కోర్ట్'  మూవీతో  ఒక్కసారిగా ప్రేక్షకులకు దగ్గరైన తెలుగమ్మాయి శ్రీదేవి.  తొలి చిత్రంతోనే తన సహజ నటన, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. వరుస సినిమాలతో సౌత్ ఇండియన్ మార్కెట్‌లో దూసుకెళ్తోంది.  'కోర్ట్' మూవీలో తన సరసన నటించిన నటుడు రోషన్‌తో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో భాగమైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామాకు 'బ్యాండ్ మేళం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

తమిళంలో యూత్‌ఫుల్ 'హైకూ'

తెలుగులో వరుస సినిమాలు చేస్తుండగానే.. శ్రీదేవికి తమిళంలోనూ మంచి ఆఫర్ లభించింది. ఆమె కథానాయికగా నటిస్తున్న తమిళ చిత్రానికి లేటెస్ట్ గా 'హైకూ' అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తమిళ నటుడు ఏగన్‌ హీరోగా నటిస్తున్నారు. 'హైకూ' టైటిల్‌కు తగ్గట్టుగానే, పోస్టర్ చూస్తుంటే ఇది పూర్తిగా యూత్‌ఫుల్ కాలేజీ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు మరో తెలుగు టాలెంట్ అండగా నిలుస్తోంది. తెలుగు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గతంలో 'కోర్ట్' చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఇప్పుడు వీరిద్దరూ తమిళంలో కలిసి పనిచేయడం, మంచి సంగీతాన్ని ఆశించే ప్రేక్షకులకు పండుగే అని చెప్పవచ్చు. దీనిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

'కోర్ట్' చిత్రంతో బలమైన అడుగు వేసిన శ్రీదేవి, తన సహజ నటనతో సౌత్ లో ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. 'హైకూ' లాంటి లవ్ స్టోరీతో తమిళ ప్రేక్షకులను మెప్పించి, అక్కడ కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటుందో లేదో వేచి చూడాలి.