
కోరుట్ల, వెలుగు: పండుగకు పిలువలేదన్న కోపంతో ఓ మహిళ మరో ఇద్దరు మహిళలకు కోర్టు నోటీసులు పంపించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన మాల సంఘం మహిళలు ఇటీవల గాజుల పండుగ నిర్వహించుకున్నారు. అయితే ఈ పండుగకు తనను పిలువకుండా అవమానించారన్న కోపంతో... అదే సంఘానికి చెందిన అడ్వకేట్ కొంపెల్లి సురేశ్ భార్య అనిత సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు కోర్టు నుంచి నోటీసులు పంపించారు. గాజుల పండుగకు తనను ఎందుకు పిలువలేదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే పండుగను స్నేహితులం కలిసి చేసుకున్నామని, అనితను కూడా పిలిచినా ఆమె రాలేదని, ఇలా నోటీసులు పంపడం సరికాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.