మంచిర్యాల ఆర్డీవో ఆఫీస్​.. ఆస్తుల అటాచ్​కు కోర్టు ఆర్డర్

మంచిర్యాల ఆర్డీవో ఆఫీస్​.. ఆస్తుల అటాచ్​కు కోర్టు ఆర్డర్
  •  భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడంతో ఉత్తర్వులు 
  • జిల్లా ఉన్నతాధికారుల జోక్యంతో వెనుదిరిగిన కోర్టు సిబ్బంది

మంచిర్యాల, వెలుగు : భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు మంచిర్యాల ఆర్డీవో ఆఫీస్​ఆస్తులను అటాచ్​ చేసే పరిస్థితి వచ్చింది. నిరుడు అక్టోబర్‌ 4న మంచిర్యాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.ఉదయ్​కుమార్‌ తీర్పునిస్తూ మూడు నెలలోపు పరిహారం పైసలు జమ చేయకపోతే ఆస్తులను జప్తు​ చేయాలని ఆదేశించారు.

 జడ్జి ఇచ్చిన గడువు పూర్తి కావడంతో బుధవారం కోర్టు సిబ్బంది ఆర్డీవో ఆఫీస్​లో కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర సామాన్లను తీసుకెళ్లేందుకు డీసీఎం వ్యాన్​తో వచ్చారు. కంప్యూటర్లు, ఫర్నిచర్​ను తీసి వరండాలో పెట్టారు. దీంతో ఆర్డీవో రాములు, అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. మూడు గంటల హైడ్రామా తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో కోర్టు సిబ్బంది తిరిగి వెళ్లిపోయారు. 

కేసు పూర్వాపరాలివి.. 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి శివారులోని పట్టాదారులు ఖాజా బేగం, అమీనా అజ్మరీ బేగం, మహ్మద్‌ నసీరుద్దీన్‌ కు చెందిన సర్వే నంబర్లు 479, 480లో 23.27 ఎకరాల భూమిని 1982లో ప్రభుత్వం తీసుకుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో పట్టు పరిశ్రమ కోసం మల్బరీ మొక్కలను పెంచడం, బిల్డింగుల నిర్మాణాల కోసం అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు భూమిని స్వాధీనం చేసుకున్నారు. మొదట పరిహారం ఇవ్వకపోవడం, తర్వాత 17.24ఎకరాలకే అవార్డు ఇవ్వడంతో పట్టాదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 రెవెన్యూ అధికారులు హైకోర్టుకు వెళ్లగా కేసును కొట్టివేసింది. తర్వాత పిటిషనర్లు నిజ పట్టాదారులా? కాదా? అని అభ్యంతరాలు రాగా, కింది కోర్టులో నిజపట్టాదారులుగా నిరూపించుకున్నారు. మళ్లీ రెవెన్యూ అధికారులు హైకోర్టులో అప్పీలు చేయగా కేసును కొట్టేసింది. 2007లో భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ పరిహారం ఇవ్వకపోగా, కింది కోర్టులో ఆర్డర్‌ ఆఫ్‌ ప్రొటెక్షన్‌ (ఓపీ) ఫైల్‌ చేశారు. 23.37ఎకరాలకు నాటి మార్కెట్​వ్యాల్యూ ప్రకారం రూ.48వేల చొప్పున రూ.11,36,400 చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. 

1982 నుంచి 2008 వరకు మార్కెట్‌ వ్యాల్యూకు అదనంగా 12శాతంతో మరో రూ.34 లక్షలు, 30 శాతం సొలాటిమ్‌ రూ.3.40లక్షలు, ఇతరత్ర ఖర్చులు, వడ్డీ అన్నీ కలిపి రూ.2 కోట్ల 92 లక్షల 93వేల 283 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రెవెన్యూ అధికారులు ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో 2017లో ఆఫీస్​ప్రాపర్టీ అటాచ్‌మెంట్‌ కోసం కేసు వేశారు. ఎట్టకేలకు నిరుడు అక్టోబర్‌లో ఆస్తులు అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు సిబ్బంది ఆస్తులు జప్తు చేయడానికి ప్రయత్నించడం రెవెన్యూ వర్గాలను కలవరపర్చింది. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.