రాహుల్ గాంధీ పిటిషన్ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు.. విచారణకు అవకాశం

రాహుల్ గాంధీ పిటిషన్ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు.. విచారణకు అవకాశం

సిక్కుల గురించి  వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిటిషన్ ను తిరస్కరించింది అలహాబాద్ హైకోర్టు. ఈ కేసులో రివిజన్ పిటిషన్ స్వీకరించిన  వారణాసి స్పెషల్ కోర్టు ఉత్వర్తులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

రాహుల్ గాంధీ 2024లో  అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి. భారతదేశంలోని సిక్కులు తలపాగాలు లేదా కారా (స్టీల్ బ్రాస్లెట్) ధరించడానికి అనుమతి లేదని, గురుద్వారాలలోకి ప్రవేశించడానికి కూడా అనుమతి లేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై పిటిషన్ దాఖలైంది. సిక్కులకే కాకుండా ఇండియాలో అన్ని మతాల ప్రజలకు స్వేచ్ఛగా తమ మతాన్ని అనుసరించే అవకాశం లేదని ఆయన విర్జీనియాలో ఓ మీటింగ్ సందర్భంగా అన్నారు. 

రాహుల్ వ్యాఖ్యలపై  2024 నవంబర్ 28న  దాఖలైన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు (ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు) విచారణ తర్వాత కొట్టివేసింది. దీంతో నాగేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి వారణాసి సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివిజన్ పిటిషన్ ను స్వీకరించేందుకు  2025 జూలై 21 స్పెషల్ కోర్టు అంగీకరించింది. దీంతో  స్పెషల్ కోర్టు ఉత్తర్వులను రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 3న తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. లేటెస్టుగా రాహుల్ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు రిజెక్ట్ చేయడంతో ఆయనపై విచారణ వేగవంతం కానుంది.