గుజరాత్‌ హైకోర్టులో డ్రామా... విచారణ సమయంలో నలుగురు ఆత్మహత్యాయత్నం

గుజరాత్‌ హైకోర్టులో డ్రామా... విచారణ సమయంలో నలుగురు ఆత్మహత్యాయత్నం

గుజరాత్ హైకోర్టు రూమ్ లో   డ్రామా చోటు చేసుకుంది.  బ్యాంక్ ను మోసం చేసి..  వేరొకరి పత్రాలతో రుణం తీసుకున్న బ్యాంక్ మేనేజర్ కు బెయిల్ మంజూరు చేయడంతో...  విచారణ జరుగుతుండగానే కోర్టులోనే నలుగురు బాధితులు ఆత్మహత్యాయత్నం చేశారు.  ఈ ఘటన సెషన్   కెమెరాలో రికార్డయింది.  

గుజరాత్ హైకోర్టులో గురువారం ( జూన్ 15)  నలుగురు వ్యక్తులు ఫినాయిల్ తాగి   ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  బ్యాంకర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ...  కోర్టు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వారు ఈ ఘటనకు పూనుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వారిని  జయశ్రీ పంచాల్, శైలేష్ పంచాల్, హార్దిక్ పటేల్ మరియు మనోజ్ వైష్ణవ్‌గా గుర్తించారు. తక్షణమే వారిని సోలా సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ( వార్త రాసే సమయానికి)  వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన  కోర్టు విచారణ సమయంలో జరిగింది.   కోర్టు  సెషన్  ప్రత్యక్ష ప్రసార సమయంలో కెమెరాలో రికార్డైంది.

పాంచాల ఇంటిని వారికి తెలియకుండా తాకట్టు పెట్టడం...

బ్యాంకును  మోసం చేసిన  ఆరోపణల కేసులో ఫిర్యాదుదారులుగా ఉన్న పాంచాలు...  కలర్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్  కిన్నార్ షా..  తమకు (ఆత్మహత్యాయత్నం చేసిన వారు)  తెలియకుండా తమ ఇంటిని తనఖా పెట్టి కోటి 60 లక్షల రూపాయిలు రుణం తీసుకున్నారని పాంచాలు ఆరోపించారు. ఈ కేసు గురించి జనవరి 13న ఆనంద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న కలర్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ షా ముందస్తు బెయిల్‌ను కోరగా, జస్టిస్ నిర్జర్ దేశాయ్ బెయిల్ మంజూరు చేశారు.  దీనికి నిరసనగా మొదట జయశ్రీ పంచల్ ఫినాయిల్ తాగగా.. మిగతా వారు ఆమెను అనుసరించి ఆత్మహత్యాయత్నం చేశారు.  అయితే అధికారులు, పోలీసులు  జోక్యం చేసుకుని  వారి భద్రతకు హామీ ఇచ్చారు.