రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
  • మూడో రోజూ వందకు పైనే..
  • బీఏ 4, బీఏ 5 వల్లే వ్యాప్తి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో బీఏ 4, బీఏ 5 డేంజర్​ బెల్స్​ మోగుతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజూ వందకుపైగానే నమోదయ్యాయి. గురువారం 12,385 మందికి టెస్టు చేస్తే 122 మందికి పాజిటివ్​ వచ్చిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. హైదరాబాద్​ జిల్లాలో 94, రంగారెడ్డిలో 12, మేడ్చల్​లో 9 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్​​లో ఒమిక్రాన్​ ఉప వేరియంట్లు బీఏ 4, బీఏ 5 వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెప్పారు. డెల్టాలాగా ఇవి ప్రమాదకరం కాకపోయినా మున్ముందు కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సర్కారును వారం క్రితమే కేంద్రం అప్రమత్తం చేయగా.. గురువారం మరోసారి రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీట్​మెంట్​ పద్ధతులను ఫాలో కావాలని సూచించారు.

వారంలోనే డబుల్..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ సెక్రటరీ.. అన్ని రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలకు గురువారం లెటర్లు పంపారు. గత వారం రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని లేఖలో ప్రస్తావించారు. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాలని కోరారు. జూన్ 1 నాటికి  ప్రతిరోజు సగటున 2,022  కేసులు నమోదైతే.. గత వారం ఆ సగటు 4,207కు చేరిందని వివరించారు. పాజిటివిటీ రేటు 0.63 నుంచి 1.12కు పెరిగిందని వెల్లడించారు. టెస్టుల సంఖ్య పెంచాలని..వ్యాక్సిన్‌‌ స్ర్టాటజీని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు.