కరోనా మృతులు లక్షలోపే ఉండొచ్చు..

కరోనా మృతులు లక్షలోపే ఉండొచ్చు..

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య లక్షలోపే ఉండవచ్చని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. దేశంలో లాక్ డౌన్ విధించడం వల్లనే లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లైందన్నారు. అమెరికాలో కరోనా వల్ల 22 లక్షల మంది వరకూ చనిపోవచ్చని మొదట్లో పలు అంచనాలు వెలువడ్డాయి. తాము తీసుకున్న చర్యల ఫలితంగా మరణాలు 2.40 లక్షలకు పరిమితం కావచ్చని ట్రంప్ అప్పట్లో చెప్పారు.

ఓల్డేజ్‌‌ హోమ్ లో 98 మంది మృతి

కరోనా మహమ్మారి న్యూయార్క్ లోని ఓ ఓల్డేజ్‌‌ హోమ్ లో 98 మందిని బలితీసుకుంది. సిటీలోని ఇసాబెల్లా జెరియాట్రిక్ సెంటర్‌‌లో 46 మంది కరో నాతో మరణించారని అధికారులు కన్ఫమ్ చేశారు. కానీ మరో 52మంది కూడా వైరస్ వల్లే మృతి చెందారని తేలింది. న్యూయార్క్ లోని 19 నర్సింగ్ హోమ్‌‌లలో ఒక్కోచోట 20కు మించే కరోనా మరణాలు నమోదయ్యాయని, ఆరింటిలో 40కి పైగా మంది చనిపోయారని సర్వేలో తేలింది.

న్యూయార్క్ లో సెప్టెంబర్ వరకూ స్కూళ్లు బంద్

న్యూయార్క్​లో ఈ ఏడాది సెప్టెంబర్​వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు గవర్నర్ ఆండ్రూ క్యూమో ప్రకటించారు. వచ్చే అకడమిక్ ఇయర్ లోనే తిరిగి స్కూళ్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. అప్పటివరకు స్కూళ్లు, కాలేజీ స్టూడెంట్స్ కు డిస్టెన్స్​ లెర్నింగ్‌‌లోనే  క్లాస్​లు జరుగుతాయని, చైల్డ్ కేర్​సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయన్నారు.

బయటకొస్తున్న అమెరికన్లు

శుక్రవారం పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను సడలించ డంతో అమెరికన్లు బయటికి రావడం ప్రారంభించారు. టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో లాక్ డౌన్‌‌ను సడలించగా, కాలిఫోర్నియా, న్యూయార్క్‌‌ లో ఆంక్షలను కొనసాగించారు. టెక్సాస్‌‌లో రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లు, మాల్స్ 25% కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు అనుమతించారు. కేసులు తగ్గుతూ పోతే మే 18 నుంచి సెకండ్ ఫేజ్ సడలింపు చేపట్టాలని సర్కారు భావిస్తోంది. జార్జియా, అట్లాంటాలోనూ శుక్రవారం దాదాపుగా అన్ని వ్యాపారాలూ తిరిగి ప్రారంభమయ్యాయి.

వుహాన్‌‌ను చూసి నేర్చుకోవాలె: డబ్ల్యూహెచ్ వో

కరోనా వైరస్ ను హ్యాండిల్ చేయడంలో చైనా చాలా బాగా పనిచేసిందని డబ్ల్యూహెచ్‌‌వో ప్రశంసించింది. వుహాన్‌‌లో వైరస్‌‌ను కంట్రోల్ చేసిన పద్ధతులను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని కామెంట్ చేసింది. డబ్ల్యూహెచ్ వో చైనాకు ఏజెంట్‌‌గా మారిపోయిందని, ఆ సంస్థ సిగ్గు పడాలని ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌‌వో టెక్నికల్ ఆఫీసర్ మరియా వాన్ కేర్ఖోవ్ జెనీవా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందించారు.