కరోనా ఎఫెక్ట్: ఒక్కరోజులో 1990 కేసులు

కరోనా ఎఫెక్ట్: ఒక్కరోజులో 1990 కేసులు
  • దేశంలో 824 కు చేరుకున్న మృతుల సంఖ్య
  • 26 వేలు దాటిన పాజిటివ్ కేసులు
  • ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన ఒక్కరోజులోనే 1,990 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రికార్డు అని పేర్కొంది. ఇందులో 111 మంది ఫారినర్స్ ఉన్నారని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం వరకు 26,496 కు చేరుకుందని తెలిపింది. గత 24 గంటల్లోనే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 45 మంది చనిపోయారని, అందులో 22 మంది మహారాష్ట్రకు చెందినవారు కాగా ఆరుగురు గుజరాత్, ఏడుగురు మధ్యప్రదేశ్ కు చెందినవారున్నారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 824 కు పెరిగింది. మొత్తం కొవిడ్ మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 323 మరణాలు సంభవించాయి. గుజరాత్ (133), మధ్యప్రదేశ్ (99), ఢిల్లీ(54), ఏపీ(31), రాజస్థాన్ (27) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,800 మందికి పైగా కరోనావైరస్ రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు గత వారం 14.19 శాతంతో పోలిస్తే కాస్త మెరుగుపడి 21.09 శాతంగా రికార్డయింది. గత 24 గంటల్లో 741 మంది రోగులు కోలుకున్నారు.

మహారాష్ట్ర 7,628 కేసులతో దేశంలో టాప్ ప్లేస్ లో ఉంది. 323 మంది చనిపోయారు. ఒక్క రోజులోనే రాష్ట్రంలో800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,815 కేసులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. 127 మంది చనిపోయారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ 1,952 కేసులతో మూడో ప్లేస్ లో ఉంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 92 మంది చనిపోయారు. ఢిల్లీలోనూ కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. 2,051 కేసుల నమోదు కాగా 53 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.