63కు చేరిన కరోనా జేఎన్‌‌.1 కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

63కు చేరిన కరోనా జేఎన్‌‌.1 కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సబ్‌‌ వేరియంట్‌‌ జేఎన్‌‌.1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు మొత్తం 63 జేఎన్‌‌.1 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వెల్లడించింది. ఇందులో 34 జేఎన్‌‌.1 వేరియంట్‌‌ కేసులు గోవాలో రికార్డయ్యాయని తెలిపింది. మహారాష్ట్రలో 9 కేసులు, కర్నాటకలో 8, కేరళలో 6, తమిళనాడు, తెలంగాణలో రెండు కేసుల చొప్పున బయటపడ్డాయి. కాగా, దేశంలో కరోనా సబ్‌‌ వేరియంట్‌‌ జేఎన్‌‌.1 వ్యాప్తిపై శాస్త్రీయ బృందం నిశితంగా పరిశీలిస్తున్నదని, టెస్టుల సంఖ్య కూడా పెంచాలని రాష్ట్రాలు, యూటీలను కోరినట్లు నీతి ఆయోగ్‌‌ సభ్యుడు (హెల్త్‌‌) డాక్టర్‌‌‌‌ వీకే పాల్‌‌ గత వారం వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్‌‌పై ఆందోళన అవసరం లేదని, వైరస్‌‌ సోకిన వారిలో 92 శాతం మంది ఇంటి నుంచే చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. హాస్పిటల్‌‌లో చేరే వారి సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. మరోవైపు, దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం యాక్టివ్‌‌ కేసులు 4,054కు పెరిగాయని సెంట్రల్‌‌ హెల్త్‌‌ మినిస్ట్రీ సోమవారం వెల్లడించింది. గత 24 గంటల్లో వైరస్‌‌ బారిన పడి ఒకరు మృతి చెందగా, మరణాల సంఖ్య 5,33,334కు పెరిగాయని పేర్కొంది.