
వడోదరా: కరోనాతో బాధపడుతూ వెంటిలేటర్ పై ఉన్న తన భర్త వీర్యం ఇప్పించాలని ఓ మహిళ కోర్టును కోరింది. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరలో జరిగింది. కరోనా కారణంగా ఓ వ్యక్తి అవయవాలు దెబ్బతిని వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతడు బతికే అవకాశాలు తక్కువేనని డాక్టర్లు చెప్పారు. దీంతో తన భర్త వీర్యాన్ని తనకు ఇప్పించి సంతానం కలిగే ఛాన్స్ కల్పించాలని రోగి భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆమె కోరికకు భర్త తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు. మంగళవారం మహిళ వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు వెంటనే విచారించింది.
రోగి భార్య కోరిక మేరకు మరణానికి దగ్గరలో ఉన్న ఆమె భర్త వీర్యాన్ని సేకరించాలని వడోదర ఆస్పత్రిని కోర్టు ఆదేశించింది. వీర్య సేకరణకు వ్యక్తి అనుమతి అవసరమే అయినప్పటికీ, ఆ ప్రక్రియకు అనుమతి తెలిపే స్థితిలో రోగి లేడు. దీంతో అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ అశుతోశ్ జే శాస్త్రి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వెంటిలేటర్‌పై ఉన్న రోగి నుంచి డాక్టర్లు వీర్యాన్ని సేకరించారు. అయితే వీర్యం సేకరించిన రెండ్రోజుల తర్వాత గురువారం అతడు మృతి చెందాడు. కాగా కోర్టు విచారణ తరువాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కృత్రిమ గర్భధారణకు కోర్టు అనుమతి మంజూరు చేయలేదు. గుజరాత్ హైకోర్టు ఈ కేసును శుక్రవారం విచారించే అవకాశం ఉంది.