కోవిడ్ అలర్ట్: దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కు సన్నాహాలు

కోవిడ్ అలర్ట్: దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కు సన్నాహాలు

ఢిల్లీ: దేశంలో కోవిడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈనెల 27న దేశ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో, సామూహికంగా పనిచేసే చోట్ల మాస్కులు తప్పనిసరిగా ధరించాలని..  సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇప్పటికే ఎయిర్ పోర్టుల్లో స్ట్రిక్ట్ రూల్స్ అమలవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని.. ఎవరూ భయపడొద్దని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో జనవరి మొదటి వారం వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. 

దేశ వ్యాప్తంగా కోవిడ్ భయాలు

దేశవ్యాప్తంగా కోవిడ్ భయాలు కొనసాగుతున్నాయి. విదేశీ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలెర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసులను ఎదుర్కొనేందుకు అత్యవసర ప్రతిస్పందన కోసం ఈనెల  27వ తేదీన దేశ వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ లేఖలు రాశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు, లాజిస్ట్రిక్స్, మానవ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలిచ్చారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాంఢవీయ ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ ను పరిశీలించనున్నారు.

పండుగల సీజన్.. పారా హుషార్.. టెస్టులు పెంచాలని నిర్ణయించిన సర్కార్

రాబోయే పండగల సీజన్ దృష్టిలో పెట్టుకొని కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రికాషన్ డోసు కూడా తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన కరోనా రూల్స్ ను పాటించాలని కేంద్రం సూచించింది. కోవిడ్ కేసులను జీనోమ్ స్వీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్రాలకు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కేంద్రం నిబంధనలు కఠినతకం చేసింది. విదేశీ ప్రయాణికులు దేశానికి వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లక్షణాలు ఉంటే క్వారంటైన్ కు తరలిస్తోంది. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్నవారికే దేశంలోకి ఎంట్రీ అని కేంద్రం  ప్రకటించింది. ముఖ్యంగా చైనా, జపాన్, కొరియా, హాంకాంగ్,థాయిలాండ్ నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అలెర్ట్ గా ఉండాలని సూచించింది. 

మురుగు నీటిలోనూ కరోనా ఆర్ఎన్ఏ

కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్రం మరింత అప్రమత్తంగా పనిచేస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాంఢవీయ తెలిపారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో  మురుగునీటిలో కరోనా RNA గుర్తించామని చెప్పారు. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాంఢవీయ కోరారు. 

చైనా పరిస్థితుల కంటే  మన దేశంలో కోవిడ్ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ విమాన ప్రమాణాలను కట్టడి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇన్ ఫెక్షన్ వ్యాప్తిని ఆపడానికి విమానాలను నిషేధించడం అంత సురక్షితం ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్గులేరియా చెప్పారు.

పౌరులకు ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలు సూచనలుజారీ చేసింది. మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, పార్కులు, ఫంక్షన్ హాళ్లు, రైల్వే, బస్టేషన్ లలో తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలని తెలిపింది. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని చెప్పింది. వ్యక్తిగతంగా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని చెప్పింది. జనవరి మొదటి వారం చాలా కీలకమని.. కోవిడ్ ఇంక్యుబేషన్ టైమ్ అని చెప్పింది.