కరోనా వ్యాక్సిన్ మూడో డోసుపై ఐసీఎంఆర్‌‌ రిపోర్ట్

కరోనా వ్యాక్సిన్ మూడో డోసుపై ఐసీఎంఆర్‌‌ రిపోర్ట్

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌‌ డోసు వేయడంపై అవలంబించాల్సిన విధానంపై ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్‌‌) తన స్టడీ రిపోర్ట్‌ను పార్లమెంటరీ కమిటీకి అందజేసింది. తొలి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యాక తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్‌ వేసుకోవచ్చని ఈ రిపోర్టులో పేర్కొంది ఐసీఎంఆర్. డెల్టా తర్వాత వచ్చే వేరియంట్స్‌ను ఎదుర్కోవడంతో పాటు వ్యాధి తీవ్రతను, మరణాలను తగ్గించేందుకు కొవిషీల్డ్ మూడో డోసు వేయడం మంచిదని తమ అధ్యయనంలో తేలినట్లు ఆ నిపుణుల బృందంలోని ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కరోనా కొత్త వేరియంట్లను మరింత సమర్థంగా ఎదుర్కొనే శక్తిని బూస్టర్ డోస్ ఇస్తుందని అందులో పేర్కొన్నాయి. 

ఇప్పటికే ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ ఓ ప్రెస్‌మీట్‌లో బూస్టర్ డోస్ అవసరాన్ని ప్రస్తావించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు, హెల్త్ సిస్టమ్‌పై ఒక్కసారిగా భారం పడకుండా చూసేందుకు బూస్టర్ డోస్ సాయపడుతుందని చెప్పారు. కాగా, దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే దాదాపు 60 దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, రోగ నిరోధక శక్తిని ఛేదించి వైరస్ అంటుకునే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన నేపథ్యంలో మన దేశంలో బూస్టర్ డోస్ వేయడంపై చర్చ మొదలైంది. అయితే ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇది వరకే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా ఐసీఎంఆర్ రిపోర్ట్‌ సిద్ధమైనందున త్వరలోనే మూడో డోసుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.