
- టెస్టులు ఎందుకు తగ్గాయని ఢిల్లీ సర్కారుకు ప్రశ్న
న్యూఢిల్లీ: కేపిటల్ సిటీ ఢిల్లీలోని సర్కారు దవాఖానాల్లో కరోనా పేషెంట్లను జంతువులకన్నా ఘోరంగా చూస్తున్నారని సుప్రీం కోర్టు మండిపడింది. కరోనాతో చనిపోయిన వారిపట్ల ఢిల్లీ ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. మృతుల కుటుంబాలకు మరణాల గురించిన సమాచారమే ఇవ్వడంలేదని, కొన్ని సందర్భాల్లో కుటుంబాలు చివరి చూపుకు కూడా నోచుకోవడంలేదని విచారం వ్యక్తం చేసింది.
ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ.. కరోనా డెడ్‌బాడీలను పేషెంట్ల వెయిటింగ్ ఏరియాలో వదిలివేశారని రిపోర్టులు చెప్తున్నాయని, కరోనా ప్రొటోకాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఢిల్లీ సర్కారు పాటించడం లేదని సీరియస్ అయింది. కరోనా పేషెంట్లను, డెడ్‌బాడీల పట్ల ఆస్పత్రులు సరిగా వ్యవహరించడం లేదంటూ మీడియాలో ఆరోపణలు వచ్చిన మేరకు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చెపట్టింది.
ఢిల్లీలో టెస్టులు ఎందుకు తగ్గాయి?
చెన్నైలో రోజుకు 16,000, ముంబైలో 17,000 కు టెస్టులు కెపాసిటీ పెరిగితే ఢిల్లీలో మాత్రం టెస్టింగ్ 7000 నుంచి 5000 కు ఎందుకు తగ్గిందని ఆప్ సర్కారును సుప్రీం ప్రశ్నించింది. కరోనా రోగులు ఆస్పత్రుల్లో బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని మీడియా చెప్తోంటే.. ప్రభుత్వాలు మాత్రం బెడ్స్ ఖాళీగా ఉన్నాయంటోందని ఫైర్ అయింది.
ట్రీట్మెంట్ స్టేటస్ రిపోర్టులివ్వండి
జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్ కె కౌల్, ఎం ఆర్ షా ల బెంచ్.. కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులకు నోటీసులు జారీ చేసింది. రోగుల ట్రీట్మెంట్, డెడ్‌బాడీల నిర్వహణపై రిపోర్టులివ్వాలని ఆదేశించింది. రోగుల ట్రీట్మెంట్కు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశంలో అత్యధికంగా కొరోనా వైరస్ కేసుల్లో ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. రాజధానిలో ఇప్పటివరకు 34,687 మంది వైరస్ బారిన పడగా 1,085 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.