కరోనా భయంతో.. ‘ఆ నలుగురు’ దూరం: భర్త శవాన్ని తోపుడు బండిపై..

కరోనా భయంతో.. ‘ఆ నలుగురు’ దూరం: భర్త శవాన్ని తోపుడు బండిపై..

కరోనా భయం మనుషుల్లోని మానవత్వాన్ని మట్టిలో కలిపేస్తోంది. మనిషి చనిపోయాక కాటికి మోసుకెళ్లేందుకు నలుగురు మనుషులు కూడా లేకుండా చేస్తోంది. తోటి మనిషి ఏ కారణంతో ప్రాణాలు కోల్పోయినా కరోనా వల్లేనేమోనన్న ఆందోళన ప్రతి గుండెలో మార్మోగుతోంది. నిన్నటి వరకు అందరితో కలిసి తిరిగిన వ్యక్తిని కాటికి చేర్చేందుకు కనీసం నలుగురు మనుషులు కూడా ముందుకు రాలేని దయనీయ స్థితికి దిగజారుస్తోంది కరోనా మహమ్మారి. హృదయాన్ని ద్రవింపజేసే ఈ స్థితి కర్ణాటకలో చోటుచోటుకుంది. బెలగావి జిల్లాలోని అథాని టౌన్‌లో ఓ మహిళ తన భర్త మృతదేహాన్ని తోపుడు బండిపై శ్మశానానికి తీసుకెళ్లి.. దహనం చేసింది.

కుర్చీలో కూర్చుని ప్రాణం వదిలాడు..

అథాని టౌన్‌లో నివసించే 55 ఏళ్ల సదాశివ్ కొన్నాళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే బంధువులకు సంబంధించిన ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి అతడిని ఇంట్లో ఒక్కడినే వదిలేసి.. భార్య, కొడుకు, కూతురు చిక్కట్టి పట్టణానికి వెళ్లాల్సివచ్చింది. అక్కడి తిరిగి వచ్చిన తర్వాత తలుపుకొట్టినా సదాశివ్ తెరవలేదు. ఎంతకీ స్పందన లేకపోవడంతో వారు చుట్టుపక్కల వారిని పిలిచి.. తలుపుబద్ధలు కొట్టారు. చూస్తే లోపలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. దగ్గరకు వెళ్లి పలకరించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ప్రాణం కోల్పోయిన విషయం తెలిసింది. దీంతో కుటుంబసభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. అయితే సదాశివ ఉన్నట్టుండి సడన్‌గా ప్రాణాలు కోల్పోవడంతో కరోనా వైరస్ సోకి ఉండొచ్చని భయంతో చుట్టుపక్కల వారంతా దూరంగా వెళ్లిపోయారు. గురువారం నాడు అతడి అంత్యక్రియల కోసం సాయం చేయాలని కోరినా ఎవరూ ముందుకు రాలేదు. తన భర్తకు చాలా కాలం నుంచి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని, ఆయన గుండెపోటుతోనే మరణించాడని, సాయం చేయాలని కోరినా ఏ ఒక్కరూ ధైర్యం చేయలేదు. కరోనా సోకి ఉండొచ్చన్న భయంతో చుట్టుపక్కల వారు గానీ, బంధువులుగానీ ముందుకు రాకపోవడంతో ఆమె తోపుడు బండిపై మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు సిద్ధపడింది. కొడుకును వెంటబెట్టుకుని కాటికి కదిలింది. వారి పరిస్థితి చూసి చలించిపోయాడు ఒకే ఒక్క స్థానిక వ్యక్తి. అతడు వారికి సాయంగా తోపుడు బండి నడిపించి.. దహన సంస్కారాలు పూర్తయ్యే వరకూ అండగా నిలబడ్డాడు.