సైనికుల శక్తి సామర్థ్యాలపై మోడీకి నమ్మకం లేదు

సైనికుల శక్తి సామర్థ్యాలపై మోడీకి నమ్మకం లేదు

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: లడఖ్ సరిహద్దుల్లో ఇండో–చైనాలు దాదాపు లక్ష మంది సైనికులను మోహరించాయని సమాచారం. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైనాతో ఘర్షణల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకొని పలుమార్లు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు మోడీని లక్ష్యంగా చేసుకొని రాహుల్ కామెంట్స్‌ చేశారు. దేశ సైనికుల శౌర్యం, శక్తి సామర్థ్యాల పై మోడీకి నమ్మకం లేదని దుయ్యబట్టారు.

‘ఇండియన్ ఆర్మీ సామర్థ్యం, శౌర్య ప్రతాపాలపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది. ఒక్క ప్రధానికి తప్ప. ఆయన పిరికితనం చైనాను మన భూభాగాన్ని ఆక్రమించేలా చేసింది. ఆయన చెప్పే అసత్యాలే దీన్ని నిర్థారిస్తాయి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. చైనాతో సరిహద్దుల్లో ప్రతిష్ఠంభనపై ప్రధాని మోడీని నిజాలను వెల్లడించాలని పలుమార్లు రాహుల్ డిమాండ్ చేసిన విషయం విధితమే.