
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఈ మేరకు రిజైన్ లెటర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. సీపీ రాధాకృష్ణన్ దేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాధాకృష్ణన్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాధాకృష్ణన్ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు రాష్ట్రపతి.
ఈ మేరకు గురువారం (సెప్టెంబర్ 11) రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు అదనంగా అప్పగించినట్లు వెల్లడించారు.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. 2025, సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగగా.. ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండీ కూటమి తరుఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో సీపీ.రాధాకృష్ణన్ విజయం సాధించారు.
ALSO READ : పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి భారీ ఊరట
సీపీ.రాధాకృష్ణన్‌కు మొదటి ప్రాధాన్యత కింద 452 ఓట్లు పోలవ్వగా.. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పడ్డాయి. తద్వారా సీపీ.రాధాకృష్ణన్ దేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొత్తం 781 మంది ఎంపీలకుగాను 767 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ నుంచి 12 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు. 752 బ్యాలెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.