బోధన్, వెలుగు : డ్రగ్స్ వ్యసనంగా మారితే భవిష్యత్తు నాశనమవుతుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయిచైతన్య సూచించారు. శనివారం బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్హాల్లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్వంలో యువతకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. స్నేహితులతో సరదాగా మత్తు అలవాటై వ్యసనంగా మారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. చదువు, కెరీర్ దెబ్బతింటుందని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలు వస్తాయన్నారు.
మత్తుపదార్థాల ప్రభావంతో యువత తప్పుడు మార్గాల్లో వెళ్లి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేయడం, వాడడం, వాటికి సహకరించడం చట్టవ్యతిరేకమని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి సలహాలు ఇవ్వాలని కోరారు. ‘డ్రగ్ ఫ్రీ తెలంగాణ’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 1098ను సంప్రదించాలన్నారు. నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీస్ , మహిళల భద్రత నిర్వహణ కోసం విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కవితా రెడ్డి, ట్రెజరర్ కేతం సంతోష్ , జాయింట్ సెక్రటరీలు దుష్వంత్ , డాక్టర్ శిరీష్ , హితిన్ భీమాని, డాక్టర్ ఉషారాణి ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ కొడాలి కిషోర్, సాంబిరెడ్డి, బోధన ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సైలు భాను ప్రకాశ్, సందీప్ నార్కోటిక్, మనోజ్, మహేశ్, భాస్కర్, మచ్ఛెందర్ రెడ్డి, 1500 మంది కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
స దాశివనగర్ : సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో డ్రంక్అండ్డ్రైవ్లో పట్టుబడినవారికి, పేకాటరాయుళ్లకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ మద్యం మత్తులో డ్రైవింగ్చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దన్నారు. కొద్దిపాటి ఆనందం కోసం మత్తుపదార్థాలు తీసుకుని ప్రాణాలు పోగా కుటుంబాలు రోడ్డునపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
