
- హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ పెరిగింది
- కిందటి ఏడాది కంటే 2 శాతం పెరిగిన నేరాలు
- మహిళలపై 12 శాతం పెరిగిన దాడులు
- పోక్సో కేసులు 12 శాతం తగ్గుదల
- 2022–23 వార్షిక నివేదిక విడుదల చేసిన సిటీ సీపీ శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్,వెలుగు: కిందటి ఏడాదితో పోలిస్తే హైదరాబాద్నగరంలో ఈ ఏడాది క్రైమ్‌రేట్2 శాతం పెరిగింది. ఆర్థిక నేరాలు, మహిళలపై దాడులు, ఇండ్లలో చోరీలు, సైబర్ నేరాలూ పెరిగాయి. నిరుడు 24,220 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 24,821 కేసులు రిజస్టర్ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక నేరాల్లో రూ.9,675 కోట్లను దుండగులు కొల్లగొట్టారు.403 మంది మహిళలు అత్యాచారాలకు గురికాగా, 46 మంది వరకట్నపు వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్నారు.
సైబర్ క్రైమ్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భారీగా పెరిగింది. 2,735 కేసులు నమోదు కాగా, ఇందులో రూ.133.60 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచేశారు. సిటీ కమిషనరేట్‌లోని ఐదు జోన్ల పరిధిలో ఈ ఏడాది నమోదైన కేసులు, క్రైమ్ రేట్ వివరాలతో కూడిన 2023 వార్షిక నివేదికను పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. బంజారాహిల్స్‌లో ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. జాయింట్ సీపీ రంగనాథ్, ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్, డీసీపీలు, ఐటీ సెల్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు.
‘‘సైబర్ నేరాలు గతేడాది కంటే 11 శాతం ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. గతేడాది జరిగిన నేరాల్లో బాధితులు రూ.82 కోట్లు కోల్పోగా ఈ ఏడాది రూ.133.60 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేశారు.ఈ క్రమంలోనే అన్ని ఆర్థిక నేరాలకు సంబంధించి 5,684 కేసులు నమోదు కాగా వీటిలో రూ. 9675.67 కోట్లు బాధితులు నష్టపోయారు. పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయి. సిటీలో మొత్తం 63 హత్య కేసులు నమోదు కాగా 262 హత్యాయత్నం కేసులు రిపోర్ట్ అయ్యాయి. ప్రేమ వ్యవహారాలు ఇతర కారణాలతో 403 మంది మహిళలపై అత్యాచారం జరిగింది. బాధితులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగానే రేప్ కేసులు నమోదు అయ్యాయి” అని సీపీ తెలిపారు.
పనిచేత కానీ వాళ్లే సిఫార్సు లెటర్స్‌తో వస్తరు
‘‘లీడర్ల సిఫార్సు లెటర్స్‌తో పోస్టింగ్స్ పొందిన వారిని గుర్తిస్తాం. అలాంటి వారిని పనిచేతగాని వారి కిందనే పరిగణిస్తాం. ప్రజాస్వామ్యంలో సిఫార్స్ లెటర్స్ అనేవి కామన్ అయ్యాయి. నా వద్దకు ఎవరైనా వస్తే వాళ్లను డ్యూటీకి అన్‌ఫిట్ కేటగిరిలో చేర్చుతాను. దీంతో వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉండదు. సివిల్ మ్యాటర్స్‌లో బలహీనులకు న్యాయం చేసేందుకు మాత్రమే పోలీసులు చర్యలు తీసుకుంటారు. తీవ్రతను బట్టి కేసులు నమోదు చేయడమో లేక సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడం చేయాలి. రూల్స్‌కు విరుద్ధంగా సివిల్ వివాదాల్లో తలదూర్చితే చర్యలు తప్పవు.
విధుల్లో అవినీతి, నిర్లక్ష్యం, క్రిమినల్ చర్యలకు పాల్పడిన 50 మందిపై చర్యలు తీసుకున్నాం. ఇందులో అవినీతికి పాల్పడిన 8 మందిని సర్వీసుల నుంచి తొలగించగా సస్పెన్షన్‌లో ఉన్న వారిలో 15 మందికి క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉంది. మరో19 మంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారిపై వేటు తప్పదు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ సీపీ ఆఫీస్‌లో వారంలో రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలు మా వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు” అని సీపీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.